సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో జీహెచ్ఎంసీ పెట్టింది పేరుగా నిలుస్తోంది..ఇప్పటికే ఒకే పనికి రెండేసి సార్లు కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్లు ఇచ్చి.. దాదాపు రూ.100కోట్ల మేర ప్రజాధనం పక్కదారి పట్టిన కొన్ని నెలల తర్వాత మేల్కొన్న యంత్రాంగం.. దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది.. ఈ ఘటన మరువకముందే జీహెచ్ఎంసీ మలక్‌పేట ట్రాన్స్‌పోర్టు విభాగంలో కార్పొరేషన్ ఖజానాకు కన్నం వేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న కొందరు అధికారుల, సిబ్బంది డిజిల్ దందా బట్టబయలైంది.
కేవలం కాగితాలకే పరిమితమైన ప్రయాణాలకు లీటర్ల కొద్దీ డిజిల్ నింపుతున్నట్లు చూపిస్తూ రూ.లక్షల్లో నిధులు స్వాహా చేస్తున్న అక్రమారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కనీస దూరాలు కూడా తిరగని వాహనాలకు విపరీతంగా ఇంధనం వినియోగించినట్లు రికార్డులు సృష్టించి బల్దియా సొమ్మును మింగేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు, స్పష్టం చేస్తున్న విజిలెన్స్ నివేదికలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.మలక్‌పేట ట్రాన్స్ వాహనాల వినియోగం పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ అంతాఇంతా కాదు.
ఆర్ఎఫ్సీ వాహనాలు కనీసం 20 కిలోమీటర్లు కూడా తిరగడం లేదు. కానీ, వాటి పేరిట ఏకంగా 25 లీటర్ల డీజిల్‌ను డ్రా చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. టిప్పర్ల విషయానికొస్తే గరిష్ఠంగా 15 కిలోమీటర్లు తిరిగితేనే ఎకువ, కానీ ప్రతి రోజూ 20 లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు లెకలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో టిప్పర్లు వీటికి రోజుకు 10 లీటర్ల వంతున ఇంధనం కేటాయిస్తున్నట్లు కాగితాల్లో చూపుతున్నారు. ఈ విధంగా వాహనాల పేరిట రోజుకు కనీసం 400 లీటర్లకు పైగా డీజిల్‌ను అదనంగా కాజేస్తున్నట్లు విజిలెన్స్ విభాగం ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతీ వాహనం రోజుకు కనీసం 7 పాయింట్లను చేరుకోవాల్సి ఉండగా, కేవలం 2 పాయింట్లకు మాత్రమే వెళ్తూ మమ అనిపిస్తున్నట్లు ప్రధాన ఆరోపణ. మిగిలిన నిధులను యథేచ్ఛగా నొక్కేస్తున్నారన్న ప్రచారం బలంగా ఉంది.

విజిలెన్స్ తేల్చినా.. పత్తాలేని చర్యలు!
ఈ భారీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టి ఐదుగురు అధికారుల ముఠా పాత్ర ఉన్నట్లు స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ఇందులో డిపార్ట్ మెంటల్ ఇంజినీర్(డీఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఫోర్ మన్ భాగస్వామ్యులై అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక తేటతెల్లం చేసింది. కానీ, అధికారులు మాత్రం కనీసం ఆ స్టేషన్‌లోని ఉద్యోగులను బదిలీ కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విజిలెన్స్ నివేదిక ఇచ్చినా సదరు ఐదుగురిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చర్యలు లేకపోవడంతో అదే ఐదుగురిలో ఒకరు మరింతగా అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఉన్నతాధికారుల అండదండలు పుషలంగా ఉండటంతోనే వీరు ఈ స్థాయిలో చెలరేగిపోతున్నారని తోటి ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయిలోనే మద్దతు లభిస్తుంటే ఇక చర్యలు ఎలా ఉంటాయని, మనకు కూడా ఇలాంటి అధికారుల అండ ఉంటే బాగుండు అని మరికొందరు ఉద్యోగులు వ్యాఖ్యానిస్తుండటం కార్పొరేషన్లో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.