హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణలో ‘4ఈ’ విధానాన్ని అమలు చేయనున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తితో కలిసి ఏడు జిల్లాల కలెక్టర్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్ల సీపీలు, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు, సంబంధిత యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్రం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో మేడ్చల్ -మలాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆయా జిల్లాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి, మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
ఈ ఏడు జిల్లాల్లో 48 కీలక ప్రమాద కారిడార్లు, నాలుగు లేదా అంతకంటే ఎకువ మరణాలు నమోదైన 230 ప్రాంతాలు, 220 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 183 కీలక పాదచారుల ప్రమాద ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 కీలక కారిడార్లు, రంగారెడ్డిలో 98 ప్రాధాన్య ప్రమాద ప్రాంతాలు, 99 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 66 పాదచారుల ప్రమాద ప్రాంతాలు ఉన్నట్టు తెలిపారు. మార్గదర్శక్ పోర్టల్లో ప్రమాదాలు, గాయపడిన వారి వివరాలు తదితర సమాచారాన్ని నమోదు చేయాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి అధికారులకు సూచించారు. నవంబరు 3న చెన్నైలో జరుగనున్న సమావేశంలో తెలంగాణ సీఎస్, డీజీపీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు, రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.