హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనున్నట్టు తెలుస్తున్నది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 3.38 కోట్ల మంది ఓటర్ల సంఖ్య నుంచి తుది జాబితా వెలువడే నాటికి సుమారు 2.65 కోట్ల నుంచి 2.70 కోట్లకు తగ్గే అవకాశం ఉన్నదని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు సుమారు 2.31 కోట్ల మంది ఓటర్లను గుర్తించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘సర్’ ప్రక్రియలో భాగంగా సమర్పించిన వివరాల పరిశీలన, అభ్యంతరాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయి. మొత్తం జారీచేయాల్సిన 92,88,181 నోటీసులకుగాను బుధవారం నాటికి 91,92,625 నోటీసులు అందజేశారు.
ఇంకా 95,555 నోటీసులు అందించాల్సి ఉన్నది. అంతిమ ప్రచురణకు అర్హులుగా 71,23,526 మంది ఓటర్లను తేల్చారు. మిగిలిన నోటీసులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. అయితే జూలై 10న ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు ముగిసే నాటికి 2,64,87,213 మంది మాత్రమే తమ వివరాలను సమర్పించారు. ఎన్నికల సంఘం పరిశీలనలో 92,87,577 ఫారాల్లో సమస్యలు గుర్తించారు. వీటిలో 60,50,918 మంది వివరాల్లో పేరు, వయస్సు, లింగం, ఫొటో తదితర అంశాలకు సంబంధించి వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. మరో 32,36,659 మంది ఓటర్లు ఎస్ఐఆర్-2002కు సంబంధించిన వివరాలను సమర్పించలేదు.
ఓటర్ల తొలగింపునకు సంబంధించి 27,193 ఫారం-7 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. మొత్తం దరఖాస్తుల్లో 25,335 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కొంతమంది బూత్ స్థాయి ఏజెంట్లు పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు సమర్పించారంటూ రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఫారం-7 ద్వారా వచ్చిన క్లెయిమ్స్, అభ్యంతరాలన్నింటినీ నవంబర్ 5లోగా పరిషరించాల్సి ఉన్నది.
సర్ ప్రక్రియలో కొత్తగా ఓటు హకు పొందేందుకు అర్హత కలిగిన యువత నుంచి గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 4.35 లక్షల మంది యువత, విదేశాల్లో నివసిస్తున్న 6,233 మంది భారతీయులు కూడా ఓటర్ల జాబితాలో తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్యూమరేషన్ దశలో గుర్తించిన అనర్హతలు, అభ్యంతరాల పరిషారం, కొత్తగా వచ్చిన చేర్పులు, తొలగింపులు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ఓటర్ల జాబితా సిద్ధం కానున్నది. ఎన్నికల అధికారుల అంచనా ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి తెలంగాణలో ఓటర్ల సంఖ్య 2.65 కోట్ల నుంచి 2.70 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉన్నది. ఓటరు జాబితాలో సవరణలు లేదా మార్పుల కోసం ఫారం-8 ద్వారా 2,62,719 దరఖాస్తులు అందాయి. నవంబర్ 9న వెలువడనున్న తుది ఓటర్ల జాబితాతో తెలంగాణలో సర్ ప్రక్రియకు తుది రూపు రానున్నది.