హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : దక్షిణ భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టిసారించింది. ఆరు రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో నిర్వహించిన భారీ ఆపరేషన్లో 18 మంది మహిళలుసహా మొత్తం 101 మంది నిందితులను అరెస్టు చేసింది. వీరి మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా సు మారు రూ.17 కోట్ల మోసపూరిత లా వాదేవీలు జరిగినట్టు గుర్తించింది.
సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ రెండు వారాల ఆపరేషన్ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిలో కొనసాగింది. 100 మందికిపైగా సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఏకకాలంలో చర్యలు చేపట్టినట్టు డీజీ శిఖాగోయెల్ చెప్పారు. మొత్తం 101 మంది అరెస్టు అయినట్టు తెలిపారు. మోసపూరిత లావాదేవీలపై ఖాతాదారులు, మధ్యవర్తులకు 5% వరకు కమీషన్ చెల్లిస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.