హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో నకిలీ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలకు చోటులేకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (టీజీ సీఈవో) కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఓటరుగా నమోదయ్యేందుకు సమర్పించే డిగ్రీ, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల ప్రామాణికతను పరిశీలించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్టు తెలిపారు.
దరఖాస్తుల పరిశీలన సమయంలో ధ్రువీకరణ పత్రాలు అసలైనవేనా? వాటిలోని వివరాలు సరైనవేనా? అనే అంశాలను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిర్ధారించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా పునఃసిద్ధం చేస్తున్నారు. ఇందుకు 2026 నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించారు.
గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ప్రతి ఎన్నికకూ ముందు కొత్తగా రూపొందించాల్సి ఉండటంతో ఇప్పటికే జాబితాలో ఉన్నవారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి బుధవారం నాటికి 94,059 దరఖాస్తులు అందాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గానికి 1,26,955 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి అప్లికేషన్‌నూ నిశితంగా పరిశీలించడం ఎన్నికల అధికారులకు కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ధ్రువీకరణపత్రాల ప్రామాణికతను సాంకేతికంగా తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు.
గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటరుగా నమోదుకు తెలంగాణ సీఈవో అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. సవరించిన ఫామ్-18ను ఉపయోగించి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్వో), డిజిగ్నేటెడ్ ఆఫీసర్ లేదా అదనపు డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌కు నేరుగా అందజేయవచ్చు. పోస్టు ద్వారా కూడా అధికారులకు దరఖాస్తు పంపే అవకాశం ఉన్నది. ఫామ్-18 దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6 చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నారు. నవంబర్ 25న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రచురిస్తారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు ఉంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు దాఖలు చేయవచ్చు. వచ్చిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను డిసెంబర్ 25లోగా పరిషరించనున్నారు. తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 30న ప్రచురించేందుకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ రూపొందించారు.