GHMC | మియాపూర్, మార్చి 6 : చందానగర్ సర్కిల్ పరిధిలో పన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో భారీగా పన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య భవనాన్ని కొద్ది రోజుల క్రితం సీజ్ చేశారు. పన్ను చెల్లింపు చేయకపోవడంతో ఇంకా సీజ్ కొనసాగుతూ ఉన్నది .ఆర్థిక సంవత్సరం కొద్ది రోజుల్లో ముగియనుండడంతో ఎలాగైనా పన్ను బకాయిలతో పాటు 100 శాతం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.
చందానగర్ సర్కిల్ పరిధిలో సుమారు 400 వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల నుంచి పెద్ద మొత్తంలో పన్ను బకాయి నెలకొని ఉంది. ఇప్పటికే బకాయిదారుల వివరాలను సేకరించి వారికి నోటీసులను జారీ చేస్తున్నారు. నోటీసులకు స్పందించి పన్ను బకాయిలను క్లియర్ చేయాలని, లేని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని నోటీసుల్లో అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓవైపు పన్ను విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్ను వసూళ్లకు ప్రయత్నిస్తూనే, మరోవైపు బకాయిదారులను తీవ్రంగా హెచ్చరిస్తూ పన్ను వసూళ్లకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.. సర్కిల్ పరిధిలో ఎప్పటికప్పుడు పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్న ఉప కమిషనర్ బకాయిదారుల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నోటీసు జారీ అయిన గడువులోగా స్పందించని వారి ఆస్తులను జప్తు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు ఎలాగైనా 100 శాతం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు సిబ్బంది కృషి చేయాలని ఉప కమిషనర్ ఆదేశించారు.