GHMC Footpath | బంజారాహిల్స్, జూన్ 26: పాదచారుల సౌకర్యం కోసం లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుట్‌పాత్‌లు హోటళ్లు, వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ స్థలాలుగా ఉపయోగించుకుంటున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి వీ6 చానెల్ దాకా రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద సుమారు 20 ఏళ్లుగా చిరువ్యాపారాలు కొనసాగేవి. అయితే తాము నడిచేందుకు ఫుట్‌పాత్‌లు లేవని, రోడ్డుమీద నడుస్తుంటే ప్రమాదాలకు గురవుతున్నామంటూ కాలనీవాసులు పలుమార్లు ఆందోళనకు దిగడంతో పాటు అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు రోడ్డుపక్కనున్న చిరువ్యాపారులను తొలగించారు. రోడ్డుకు రెండువైపులా ఏడాదిన్నర క్రితం సుమారు రూ.40లక్షల జీహెచ్ఎంసీ నిధులతో ఫుట్‌పాత్‌లు నిర్మించడంతో పాటు గ్రిల్స్ ఏర్పాటు చేశారు.
ప్రారంభంలో ఫుట్‌పాత్‌పై పాదచారులు నడిచేవారు. అయితే కాలక్రమేణా కాలనీ లోపలి రెసిడెన్షియల్ భవనాలను కమర్షియల్‌గా మార్చి అద్దెలకు ఇవ్వడంతో బ్యాంకుతో పాటు రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు వచ్చాయి. దీంతో లక్షలాది రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించిన ఫుట్‌పాత్‌లను కబ్జా చేసిన ఆయా సంస్థల నిర్వాహకులు పార్కింగ్ స్థలాలుగా వినియోగిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్, బాయ్ కీ చాయ్ తదితర సంస్థల ముందు ఫుట్‌పాత్‌ను దర్జాగా మూసేసి తమ సొంత పార్కింగ్లాగా వాడుకుంటున్నారు. అయితే వీరివద్దనుంచి నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఫుట్‌పాత్ ఆక్రమణలపై నోరుమెదపడం లేదు. దీంతో కాలనీవాసులు రోడ్లమీద నడవాల్సి వస్తోంది. ఫుట్‌పాత్‌లతో పాటు రోడ్డుమీద సైతం వాహనాలు పార్కింగ్ చేస్తున్నా ట్రాఫిక్ అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలు చిరువ్యాపారాలు పెట్టుకుంటే రెండేళ్లపాటు వేధింపులకు గురిచేసిన బల్దియా, ట్రాఫిక్ అధికారులు కాలనీలోని సంస్థల ముందు ఫుట్‌పాత్‌లను అక్రమిస్తే ఎందుకు ఊరుకుంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.