Minerva Hotel | అమీర్‌పేట్, జనవరి 16: సాంబార్ రైస్‌లో పురుగులు కనిపించిన సంఘటన బేగంపేట్‌లోని పర్యాటక భవన్లో కొనసాగుతున్న మినర్వా హోటల్లో వెలుగు చూసింది. నగరానికి చెందిన జీ.ఎస్.రాణా గురువారం మధ్యాహ్నం మినర్వా హోటల్‌కు తన సోదరుడితో కలిసి వెళ్లి, ప్లేట్ ఇడ్లీ, ఓ సాంబార్ రైస్ ఆర్డర్ చేశారు. కొద్ది సేపట్లోనే సాంబార్ రైస్ టేబుల్ పైకి రావడంతో రాణా తన భోజనాన్ని మొదలుపెట్టాడు. కాసేపటికే తాను తింటున్న సాంబార్ రైస్‌లో పురుగులు కనిపించడంతో ఖంగుతిన్న రాణా వెంటనే హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు.
హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు రాణా ఆర్డర్ చేసిన ఆహారాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా జీఎస్.రాణా మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక భవన్ ఆవరణలో కొనసాగుతున్న హోటల్ కస్టమర్ల ఆరోగ్య భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని, దేశ వ్యాప్తంగా పర్యాటకులు వచ్చి పోతుండే ప్రదేశంలో ఇటువంటి ఆహార నాణ్యతా లోపాలు తలెత్తడం దురదృష్టకరమన్నారు.