అంబర్‌పేట, నవంబర్ 14 : నిబంధనలకు విరుద్ధంగా వివిధ బ్రాండ్ల పేర్లతో ఓ వ్యక్తి కల్తీ మినరల్ వాటర్‌ను తయారు చేసి బాటిళ్లలో విక్రయిస్తున్నాడు. దీంతో బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ప్లాంట్‌ను సీజ్ చేశారు. అందుబాటులో ఉన్న కొన్ని వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై కరుణాకర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ పుడ్ సేఫ్టీ అధికారి స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముండే షేక్ ఉమర్ కాచిగూడ నింబోలి అడ్డాలో వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాడు.
ప్రధాన కంపెనీల బ్రాండ్లకు సంబంధించిన పేర్లు పోలే విధంగా అల్ఫాబెటికల్లో అక్షరం కొద్దిగా తేడా ఉండేలా బాటిళ్లను రూపొందించి.. అందులో టోటల్ డిసాల్ట్ సాలిడ్స్ తక్కువగా ఉండే నీటిని నింపి విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు గురువారం ఆ ప్లాంట్ పై దాడి చేసి..నీటిని పరీక్షించారు. ఇందులో 75కు మించి టోటల్ డిసాల్ట్ సాలిడ్స్(టీడీఎస్) ఉండాల్సిందిపోయి కేవలం 18 టీడీఎస్ మాత్రమే ఉంది. దీంతో అధికారులు ఆ ప్లాంట్‌ను సీజ్ చేశారు.