Property Tax | సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000కోట్ల పన్ను వసూలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎర్లీబర్డ్ స్కీం ఆఫర్ను ఇళ్లు, వ్యాపార సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు గడిచిన 30 రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
బుధవారం రాత్రి వరకు బల్దియా రూ.891.52 కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నది. చివరి రోజు ఒక్క రోజే రూ. 93.33 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గతేడాది మొత్తం ఆదాయం రూ. 831 కోట్లు కాగా, ఈ సారి అదనంగా రూ. 60 కోట్ల మేర రాబట్టారు. అర్ధరాత్రి 12 గంటల వరకు జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులు, సిటిజన్ సర్వీస్ సెంటర్లు తెరిచి ఉంచారు. ఎర్లీబర్డ్ ఆదాయం గురువారం ఉదయం వరకు సమగ్రంగా వెల్లడవుతుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.