GHMC | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పుతోంది. ఖజానాలో చిల్లిగవ్వ లేక అభివృద్ధి పనులు కుంటుపడిన పరిస్థితులు నెలకొన్నాయి. పురోగతిలో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రస్తుతం చట్టాల ఉల్లంఘన జరుగుతున్నది. వాస్తవంగా ప్రతి వారానికొకసారి స్టాండింగ్ కమిటీ సమావేశం జరగాలి. మేయర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై చర్చించి రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర విలువైన పనులకు ఆమోదం దక్కుతుంది.
గడిచిన కొన్ని నెలలుగా స్టాండింగ్ కమిటీ ముందుకు ఎజెండా అంశాలు రాకుండా సమావేశాలు వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం చేయడం పట్ల ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన సర్వసభ్య సమావేశం (జనరల్ బాడీ మీటింగ్) చేరింది. గత జూలై 6న జరిగిన 9వ పాలకమండలి (సర్వసభ్య సమావేశం) అక్టోబర్‌లో జరపాల్సి ఉంది. కానీ ఐదు నెలలు గడిచినా.. సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు కమిషనర్, మేయర్ సిద్ధపడటం లేదు.
బల్దియా బడ్జెట్‌తో పాటు స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను కౌన్సిల్లో సభ్యుల ఆమోదం మేరకు పనులు పట్టాలెక్కాలి. కానీ ఈ అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో నగర పౌరులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రధానంగా సకాలంలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడం అనుమానంగానే ఉంది. కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారుపై కమిషనర్ ఇలంబర్తి కనీసం చర్చ ప్రస్థావనకు తీసుకురాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మేయర్, కమిషనర్ల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్టోబర్ నెలలోనే బడ్జెట్‌కి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉన్నప్పటికీ డిసెంబర్ రెండో వారం వరకు సమయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చట్టం -1955 ప్రకారం కార్పొరేషన్ బడ్జెట్ అంచనాలను గత నవంబర్‌లో బడ్జెట్ అంచనాలు, ప్రతిపాదనలపై కమిషనర్ నుంచి వివరణాత్మక సమాచారం స్టాండింగ్ కమిటీ ముందుకు రావాల్సి ఉంది. డిసెంబర్ 15వ తేదీలోపు వార్షిక బడ్జెట్ అంచనాలు స్టాండింగ్ కమిటీ ఆమోదించాలని చట్టం పేర్కొంటున్నది. ఈ నెల 10వ తేదీలోపు జనరల్ బాడీ మీటింగ్‌లో సభ్యుల ముందు చర్చ పెట్టి ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పుల ఆనంతరం ఫిబ్రవరి 20లోపు అంచనాలను మంజూరు చేయాల్సి ఉంటుందని చట్టం చెబుతున్నది.
మార్చి 1లోపు కార్పొరేషన్ బడ్జెట్ అంచనాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా కనబడుతున్నాయి. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన రూ. 8440 కోట్ల బడ్జెట్‌ను నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి చేర్చుతారా? లేదంటే కాలయాపన చేస్తారా? స్టాండింగ్ కమిటీ సమావేశాల తరహాలోనే, కౌన్సిల్ సమావేశాల లక్ష్యాలను నీరుగారుస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.