GHMC | కార్వాన్ మే 19: జీహెచ్ఎంసీ సర్కిల్ 13 పారిశుద్ధ్య విభాగం అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న నాలా నుంచి తీసిన పూడిక మట్టిని కుప్పలుగా పోసి వదిలేశారు. అంతేకాకుండా ఈ మార్గంలో చెత్తకుప్పలు ఎక్కడికక్కడ వదిలేసి ఎత్తకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తుంది. ఇటీవల పైప్లైన్ పనులు చేపట్టి గుంతలను సరిగా పూడ్చక పోవడంతో ఓవైపు గుంతలమయం, మరోవైపు పేరుకుపోయిన చెత్తకుప్పలతో గల్లి కంపు కొడుతోంది. దీంతో గుడిమల్కాపూర్ డివిజన్ సత్యనారాయణ నగర్, బాలాజీ నగర్, అల్లూరి సీతారామరాజు నగర్, హీరా నగర్ ప్రాంతాల ప్రజలతో పాటు గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్, పూల మార్కెట్, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ వెనుక ప్రాంతంలో ఝాం సింగ్ వేంకటేశ్వర స్వామి దేవాలయం పక్క నుంచి వెళ్లే రోడ్డులో చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. అదేవిధంగా ఈ రహదారిలో ఉన్న పలు ఫంక్షన్ హాళ్లకు వెళ్లే దారిలో కూడా చెత్త కంపు కొడుతుంది. ఇక్కడ చెత్తను ఎప్పటికప్పుడు తరలించడంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 13 పారిశుధ్యం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. రోడ్లపై చెత్త కుప్పలు నిండిపోవడంతో దుర్వాసనతో పరిసరాల ప్రజలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. ఓవైపు సకాలంలో చెత్తను ఎత్తకపోతుండగా మరోవైపు నాళాల్లో నుంచి తీసిన పూడికతీత మట్టిని మార్కెట్ ప్రహరీకి అనుకొని కుప్పలుగా పోయడంతో ప్రాంతమంతా కంపు వాసన కొడుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలనీల సంక్షేమ సంఘాల వారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులకు చలనం లేకుండా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ చెత్తను ఎప్పటికప్పుడు తరలించి పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.