సిటీబ్యూరో, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తన చాంబర్లో ఎంసీసీలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల లొకేషన్లు, ఎన్నికల వ్యయంపై జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సమీక్షించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీ టీమ్‌లు, పోలీస్ శాఖ సీజ్ చేసిన మొత్తాన్ని జిల్లా ఫిర్యాదుల కమిటీ ద్వారా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని రొనాల్డ్ రాస్ సూచించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే ఎకువ మొత్తంలో పట్టుబడిన నగదును ఆదాయ పన్ను శాఖకు పంపించి అకడి నుంచి విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత మొత్తాన్ని తిరిగి జిల్లా ఫిర్యాదుల కమిటీ ద్వారానే విడుదల చేయాలని భారత ఎన్నికల కమిషన్ ఎస్ఓసీ జారీ చేసినట్లు తెలిపారు. వివిధ నిఘా బృందాలు సీజ్ చేసిన మొత్తాన్ని నియోజకవర్గాల వారీగా నివేదిక అందజేయాలని ఎంసీసీ నోడల్ అధికారికి సూచించారు. సీజ్ చేసిన మొత్తంలో జిల్లా ఫిర్యాదుల కమిటీ విడుదల చేసిన మొత్తం వివరాలు అందజేయాలని ఆదేశించారు.
సమస్యాత్మక(వల్నరబుల్) పోలింగ్ కేంద్రాల లొకేషన్లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని గుర్తించారో వాటిని పునరాలోచించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మరోసారి వాటి లొకేషన్లను గుర్తించాలన్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఉన్నందున పోలీస్ సిబ్బందిని నియమించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. పోలీస్ శాఖలో ఎన్నికల విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కోరారు. అంతేకాకుండా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రొనాల్డ్ రాస్ సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా, అదనపు పోలీస్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్మాన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్‌లతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫ్లయింగ్ స్వాడ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ చెక్‌పోస్ట్‌ల వద్ద ఫ్లయింగ్ స్వాడ్ వాహనాలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిశీలించారు. అదే విధంగా సువిధ సెంటర్, ఈవీడీఏం ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఎంసీసీ, ఎంసీఎంసీ కంట్రోల్ రూంలను పరిశీలించారు.