సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చిన మోడల్ మార్కెట్లలో ఖాళీగా ఉన్న గదులను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అద్దె ప్రాతిపదికన బస్తీ దవాఖానలు, డ్వాక్రా సంఘాలు, ఇండోర్ గేమ్స్‌కు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జోనల్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్లు సమర్పించే సమగ్ర నివేదిక ఆధారంగా మోడల్ మార్కెట్ గదులను వినియోగంలోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు.
కాగా గ్రేటర్లో ఇప్పటి వరకు దాదాపు రూ. 24కోట్లు ఖర్చు పెట్టి 39 మోడల్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో మార్కెట్లో వెజిటెబుల్, నాన్‌వెజ్, స్టోర్ వేర్వేరుగా ఉండగా.. పలు దుకాణాల ఏర్పాటుతో జీ+1 నిర్మాణంతో మోడల్ మార్కెట్ల నిర్మాణం జరిగింది. అయితే 39 మోడల్ మార్కెట్లలో 583 మడిగలు ఉండగా.. 200 వరకు మాత్రమే ఆక్యుపెన్సీలో ఉన్నాయి. 383 గదులు (మడిగలు) ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రజాప్రయోజనాల కింద భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.