సిటీబ్యూరో/కవాడిగూడ, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు జరుపుతామని అల్టిమేటం జారీ చేశారు. కమిషనర్ రొనాల్డ్ రాస్, అదనపు కమిషనర్ కెనడీ వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. బిల్లులు చెల్లించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే జోనల్ కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతిపత్రాలు సమర్పించి, రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతున్న కాంట్రాక్టర్లు గురువారం ఏకంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు సాయి కిరణ్, భాస్కర్ రావు, ఆర్. హనుమంత్ సాగర్, పి.శ్రీశైలం, జి. శ్రీనివాస్‌రెడ్డి, ముజీబ్, శంకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 1200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దాదాపు 700 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వక్తం చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతామని వారు హెచ్చరించారు. గడిచిన కొన్ని రోజులుగా కాంట్రాక్టర్ల ధర్నాతో అభివృద్ధి పనులు పూర్తి నిలిచిపోయాయి.
జీహెచ్ఎంసీ బిల్లులు పెండింగ్‌లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నాం. అయినా అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. సివిల్, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీలకు సమానంగా పేమెంట్లు ఇవ్వాలి. బిల్లులు అందక రోడ్డున పడ్డాం.
– జి.శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు, జీహెచ్ఎంసీ అల్వాల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్
ఎన్నికల కోడ్ ఉన్నందున బిల్లులు చెల్లించలేదు. నూతన ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. లేకుంటే పనులు నిలిపేస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
– ఎస్.హనుమంత్ సాగర్, అధ్యక్షుడు, కాప్రా సర్కిల్ కాంట్రాక్టర్స్ యూనియన్