సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ) : కేబీఆర్ పార్కులో( KBR Park) అసంపూర్తి పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్‌రోస్(Ronald Rose) అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కమిషనర్ పార్కును జోనల్, అడిషనల్ కమిషనర్, ఇంజిజనీరింగ్ అధికారులతో కలిసి పార్కును పరిశీలించారు. గతంలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
పార్కులో మరిన్ని మౌలిక వసతులు, సుందరీకరణకు పలు సూచనలు చేశారు. సందర్శకులకు, వాకర్స్‌కు తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెంపుడు కుక్కల(Pet dogs)ను యాజమానులు తీసుకుని రాకుండా చర్యలు తీసుకోవాలని, పెంపుడు కుక్కలు రోడ్డుపైన మలినం చేయడం ద్వారా వాకర్స్ ఇబ్బంది పడుతున్నారని కమిషనర్‌కు వివరించారు. టాయిలెట్‌కు అనువైన స్థలాన్ని గుర్తించి నిర్మాణం చేయాలని, అక్కడక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని ఎస్ఈ రత్నాకర్‌ను ఆదేశించారు.
మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని వాటర్‌వర్క్స్ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇంతకు ముందు పార్కు అభివృద్ధికి చేపట్టిన పనులను పూర్తి చేయడంతో పాటు సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జోనల్ కమిషనర్ రవికిరణ్, యుబిడి అడిషనల్ కమిషనర్ డాక్టర్ సునంద రాణీ, ఎస్ఈ రత్నాకర్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.