కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 12 : కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను కోరారు. ఈ మేరకు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్నన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫతేనగర్ కాలనీ, బాలానగర్ వై జంక్షన్, ఐడీఎల్ స్వాన్లేక్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ జంక్షన్, జేఎన్టీయూహెచ్ జంక్షన్, వసంతనగర్-గోకుల్‌ప్లాట్స్, హైటెన్షన్ లైన్ జంక్షన్లలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతుందన్నారు. ఈ ట్రాఫిక్ సమస్యల పరిష్కరానికి ఫ్లైఓవర్, అండర్‌పాస్ బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం కోసం.. ఫ్లైఓవర్ల నిర్మాణం, విస్తరణ పనులకు నిధులను కేటాయించి, టెండర్లు కూడా పిలిచి పనులను అప్పగించారన్నారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ, రైల్వే అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం రైల్వేశాఖ ఎన్వోసీలను కూడా సాధించినా.. కానీ నేటికి పనులు ప్రారంభం కాలేదన్నారు. అలాగే బాలానగర్ వై జంక్షన్ విస్తరణ అండర్‌పాస్ నిర్మాణం, జేఎన్టీయూహెచ్ జంక్షన్ అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం హయాంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తిచేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నదని, ఇంత వరకు పనుల్లో ఎలాంటి పురోగతి లేదన్నారు.