సిటీ బ్యూరో, మే12: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ వినతులు స్వీకరించారు. మొత్తం 62 విన్నపాలు రాగా అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 40, ట్యాక్స్ సెక్షన్ 6, అడ్మినిస్టేష్రన్ 3, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎఫ్ఏ విభాగాలకు 2 చొప్పున, ల్యాండ్ అక్విజిషన్, హెల్త్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
ఫోన్ ఇన్ ద్వారా 5 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఫిర్యాదులను త్వర పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఆరు జోన్లలో మొత్తం 111 అర్జీలు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్, చంద్రకాంత్ రెడ్డి, పంకజ, వేణుగోపాల్ రెడ్డి, రఘు ప్రసాద్, అశోక్ సామ్రాట్, నళిని పద్మావతి, ఆయా విభాగాల ఉన్నతాధికారులు, అడిషనల్ సీసీపీ గంగాధర్, వీరన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో 121 అర్జీలు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని అదనపు కలెక్టర్ డాక్టర్ జీ ముకుందరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన 121 అర్జీలను స్వీకరించారు. హౌసింగ్ 55, పింఛన్ 40, రెవెన్యూ 13, ఇతర శాఖలకు సంబంధించిన 13 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కదిరవన్ పలని, జిల్లా అధికారులు జీ ఆశన్న, ఆర్ కోటాజీ, పవన్ కుమార్, సుబ్రహ్మణ్యం, అక్కేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.