సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): మానవాళికి, పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ఈ-వేస్ట్‌పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా ఈ-వేస్ట్ గుట్టగుట్టలుగా పడి ఉండటాన్ని గుర్తించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే 2.5 టన్నుల ఈ-వేస్ట్ ఉన్నట్లు అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలోనే గ్రేటర్లో పలు ప్రభుత్వ శాఖలతో పాటు ఐటీ కంపెనీలలో ఈ-వేస్ట్ పెద్ద మొత్తంలో వెలువడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందులో భాగంగానే ఈ-వేస్ట్‌పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ-వేస్ట్‌ను గుర్తించడం, సేకరించడం, తరలించడానికి సిద్దమయ్యారు. ఈ ప్రక్రియలో పౌరులతో పాటు ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులు, ఐటీ కంపెనీలను భాగస్వామ్యం చేయనున్నారు. ఈ మేరకు ఐటీ కంపెనీలకు కమిషనర్ లేఖ రాయనున్నట్లు తెలిసింది.
గ్రేటర్లో ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి జోన్‌తో పాటు ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు సర్కిళ్లలోని ఐటీ కంపెనీల నుంచి ఈ-వేస్ట్ తరలింపుపై దృష్టి సారించారు. ఇందుకోసం జీహెచ్ఎంసీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సీఎస్ఆర్ కింద అంజేసిన 10 ఈవీ వాహనాలను వినియోగించనున్నారు.
జోన్ల వారీగా సేకరించిన ఈ-వేస్ట్‌ను నగర శివారులోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించాలా? మరేదైన ఇతర ప్రాంతానికి తరలించాలా అన్న దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ-వేస్ట్ తరలింపులో భాగంగా ప్రత్యేక ఫోన్ నంబర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ-వేస్ట్‌ను డంపింగ్ యార్డుకు తరలించేంలా చర్యలు తీసుకోవాలని ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని కమిషనర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ ఆఫీసుల్లో ఈ-వేస్ట్‌ను డంపింగ్ యార్డుకు తరలించాలని డీసీ, జోనల్ కమిషనర్లకు కమిషనర్ సూచించారు.