సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో శాఖల వారీగా బదిలీల పరంపర కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం ఆయా జోన్లకు జోనల్ కమిషనర్లు బాధ్యతలు స్వీకరించగా, తాజాగా శనివారం 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఆయా సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లు (డీసీలు) బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ బదిలీల్లో పైరవీలతో వచ్చిన వారికే పెద్దపీట వేసినట్లు ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా దుండిగల్, నార్సింగి, మాదాపూర్, బోడుప్పల్, అల్వాల్, నిజాంపేట, కొంపల్లి , ఘట్కేసర్ సర్కిళ్ల పోస్టింగ్‌లపై తీవ్ర అరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ కమిషనర్ (శానిటేషన్-2) హోదాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి డీసీగా పనిచేసేందుకు ఇష్టపడడం విశేషం. సదరు అధికారిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చిన మళ్లీ పాత స్థానానికే డీసీగా వెళ్లడం పట్ల చర్చనీయాంశమైంది.