సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఉద్యోగుల జాబితాను జీహెచ్ఎంసీ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్లతో పాటు సంస్థ ప్రధాన కార్యాలయాలలో రిటైరయ్యాక కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై కమిషనర్ రొనాల్డ్ రాస్ శాఖల వారీగా నివేదిక తెప్పించుకున్నారు.
మొత్తం 46 మంది వరకు ఉన్నట్లు తేల్చిన అధికారులు ఈ నివేదికను గురువారం ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. అయితే జోనల్ కార్యాలయాల నుంచి వాస్తవాలు బయటకు రాలేదని, నివేదిక తూతూ మంత్రంగా తయారు చేసినట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. కమిషనర్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే రిటైర్ ఉద్యోగుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.