Ronald Ross | సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : అనుమానాస్పదమైన బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ బ్యాంకర్లను కోరారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్‌హాల్‌లో జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్, పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్యాంక్ కో ఆర్డినేటర్లు, నగదు రవాణా ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు కో ఆర్డినేటర్లకు, నగదు రవాణా ఏజెన్సీలకు ఎన్నికల నియమావళి, నగదు రవాణా మార్గదర్శకాలను వివరించారు.
ఎన్నికల సమయంలో నిబంధనల మేరకు నడుచుకోవాలని, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత ఎన్నికలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. నగదు రవాణాలో సరైన ఆధారాలు లేని ఏజెన్సీలు, బ్యాంకు కో -ఆర్డినేటర్స్ వాహనాలను సీజ్ చేసే అధికారం ఉన్నందున అధికారిక అనుమతి పత్రాలతో బ్యాంకు నుంచి ఏటీఎంలకు నగదు రవాణా తదితర అంశాలను వివరించారు. 10 లక్షలకు పైబడి నగదు, ట్రాన్స్ఫర్ చేసినా వాటి వివరాలను, ఏటీఎం, యూపీఐ లావాదేవీలపై ఆయా బ్యాంకు అధికారులు అందించాలని ఎన్నికల అధికారి కోరారు.
ముఖ్యంగా గత మూడు నెలలకు సంబంధించి నగదు లావాదేవీల నివేదికను బ్యాంకు బ్రాంచ్ వారీగా ఇవ్వాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కొత్తగా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారని, జాప్యం చేయకుండా వెంటనే చెక్ బుక్ జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, ఆర్బీఐ మేనేజర్ అంకిత్అగర్వాల్, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, ఎలక్షన్ ఎక్స్పెండేచర్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ శరత్ చంద్ర, వివిధ బ్యాంకుల కో ఆర్డినేటర్లు, నగదు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.