Hyderabad | గౌలిపురా కబేళాపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. మూతపడిన కబేళా (స్లాటర్ హౌస్)ను పున ః ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గౌలిపుర స్లాటర్ హౌస్ భవనాన్ని కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికుల నుంచి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
గౌలిపుర మేకలమండి గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బాగా నడిచిందని, కాలనీకి చెందిన ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయిందని అధికారులు కమిషనర్‌కు వివరించారు. స్లాటర్ హౌస్ పనిచేయకపోవడంతో ఆధారపడిన కుటుంబాలు ఇబ్బందులుపడ్డాయని, కోర్టు తీర్పు ఇచ్చి చాలా రోజులవుతున్నందున యంత్రాలు, మరమ్మతులు ఇంకా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కమ్యూనిటీ పెద్దలు ఈ సందర్భంగా కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. బిల్డింగ్, యంత్రాల మరమ్మతులు, నీరు ఇతర వసతులు ఏర్పాటు చేసి త్వరలోనే పున ః ప్రారంభిస్తామని కమ్యూనిటీ పెద్దలకు కమిషనర్ వివరించారు. వెంటనే ప్రాజెక్టు ఇంజినీర్‌కు ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ ఆదేశించారు.
– సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ)
కబ్జాపై ఆరా..
గౌలిపురా కబేళాకు సంబంధించిన 4.2 ఎకరాల స్థలంతో పాటు 1961లో మరో మూడెకరాలను ఎంసీహెచ్ కొనుగోలు చేసింది. రూ. 200 కోట్ల విలువైన ఆ మూడెకరాల భూమి ఎవరి చేతుల్లో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కమిషనర్‌కు ఆరె కటిక సంఘం అనేకసార్లు ఫిర్యాదులు చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్ సమగ్ర వివరాలను ఎస్టేట్ విభాగాన్ని సమర్పించాలని ఆదేశించారు.
నిజాం కాలం నాటి నుంచి..
Ghmc
గౌలిపురాలో నిజాంకాలం నుంచి కబేళా నిర్వహణ ఉంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీకి చెందిన 4.2 ఎకరాల స్థలంలోనే కబేళా నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాలతో 2003లో హైకోర్టు ఆదేశాలతో కబేళా మూతపడింది. అప్పటి నుంచి ఈ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు కన్నేశారు. కబ్జాదారులకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు కొందరు వంతపాడడంతో విలువైన స్థలాన్ని కొట్టేశారు.
గౌలిపురలోని 4.2 ఎకరాల భూమిని 2010లో అప్పటి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ ప్రైవేట్ వ్యక్తులకు మ్యూటేషన్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఆ భూమి తమదని కోర్టును ఆశ్రయించారు. తర్వాత హైదరాబాద్ కలెక్టర్‌గా వచ్చిన గుల్జార్ గౌలిపురా భూమి మ్యుటేషన్‌ను రద్దు చేసి ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటించారు.
అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో అక్కడ రూ. 7 కోట్లతో రాంకీ సంస్థ మోడ్రన్ కబేళాను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే కబేళాను ప్రారంభిస్తామని చెప్పిన కమిషనర్ ఆర్వీ కర్ణన్.. కబ్జాకు గురైన స్థలం విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.