సిటీబ్యూరో, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ వెబ్ ఎక్స్ ద్వారా అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నగరవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్, రోడ్ సేఫ్టీ డ్రైవ్ అమలుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే పారిశుధ్య సంబంధిత ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పారిశుధ్య, నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే బాధ్యులను విధుల నుంచి సస్పెండ్ చేస్తానని కమిషనర్ హెచ్చరించారు.
ఫీల్డ్ టీమ్లు జీవీపీలు, ట్రాన్స్ఫర్ పాయింట్లు వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి 100 శాతం శుభ్రత నెలకొనేలా చూడాలన్నారు. నగరవాసులు వెంట ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని సూచించారు. నాలుగు రోజుల్లోగా ప్రధాన రహదారులపై గుంతలు లేకుండా మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి సూచించారు.