సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ): ఉజ్వల భవిష్యత్తుకు సైన్సే కీలకపాత్ర అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమానికి కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరై ‘ప్రజారోగ్యం, పట్టణ పాలనలో దాని భూమిక’ అంశంపై ప్రసంగించారు. నేషనల్ సైన్స్ డేలో పాల్గొనడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, సర్ సీవీ రామన్ స్మృతులను సర్మించుకున్నారు.
నగరాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజారోగ్యం, జంతువుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ అంతర్గతంగా అనుసందానమై ఉన్నాయని చెప్పారు. దీనిని గుర్తించి చర్యలు తీసుకోవడం అనివార్యమని వివరించారు. భారత్లో ప్రతి ఏడాది 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయని, వీరిలో ఎక్కువ మంది 15 ఏండ్లలోపు పిల్లలేనని కమిషనర్ అన్నారు. జీహెచ్ఎంసీ రేబిస్ నియంత్రణ చర్యలు తీసుకుంటుందని, సాముహిక టీకా కార్యక్రమాలు, బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యం, కుక్క కాటు నివారణకు అవగాహన కల్పించడం చాలా కీలకమని పేర్కొన్నారు.
సురక్షితమైన ఆహార ఉత్పత్తి, నిల్వ, పంపిణీని నిర్థారించడంతో కఠిన నియంత్రణలు ఆమలు చేస్తుందన్నారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు పట్టణ ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం రియల్ టైం, డిసీస్ ట్రాకింగ్ చేపట్టిందన్నారు. వదరలు, నిల్వ నీరు, మౌలిక సదుపాయాల నష్టాన్ని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ వరద నీటి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఏబీ డైరెక్టర్ డాక్టర్ జి.తారుశర్మ, పీహెచ్డీ విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.