Amrapali | సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ) : ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని విభాగాల అధికారులతో కలిసి బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో షెడ్యూల్ మేరకు కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. ఇందులోభాగంగానే ప్రజలకు ఉపయోగకరమైన మొకలను ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వం ఒకో రోజు ఒకో వినూత్న కార్యక్రమాన్ని నిర్దేశించిన నేపథ్యంలో ఆయా రోజుల్లో సంబంధిత కార్యక్రమాలను నిర్వహించి, సాయంత్రం 4 గంటల్లోపు నివేదిక సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.
బల్దియాలో అంతర్గత బదిలీలు అత్యంత పారదర్శకంగా జరిగేలా కమిషనర్ ఆమ్రపాలి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. అవినీతి, ఆరోపణలు, సుదీర్ఘకాలం తిష్ట వేసిన ఉద్యోగులు బదిలీ కానున్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు కమిషనర్ ప్రత్యేక కమిటీని వేశారు. ఇందులో అదనపు కమిషనర్లు సత్యనారాయణ, నళిని పద్మావతి, పంకజ, గీతా రాధిక ఉన్నారు.