సిటీబ్యూరో, అక్టోబర్ 8 : పారిశుద్ధ్య నిర్వహణపై(Sanitation management) అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండాపారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(Amrapali) సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ ఆమ్రపాలి చార్మినార్ జోన్ లోని అత్తాపూర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, మీర్ఆలం ట్యాంక్, బహదూర్‌పుర తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, స్థితి గతులను పరిశీలించి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని, ఈ విషయంలో ప్రజలు పరిశుభ్రత పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛ ఆటోల కదలికలను, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలన్నారు. దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్స్, ఫాగింగ్ తదితరాలను చేయాలని ఆదేశించారు. అదే విధంగా రోడ్లపై ఏర్పడిన స్పాట్హోల్స్ను పూడ్చి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.