సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): నగరాభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ అనుబంధ శాఖల అధికారులతో సిటీ అభివృద్ధే లక్ష్యంగా 66వ కన్వర్జెన్సీ సమావేశం జరిగింది.
ఇందులో తీసుకున్న ఎజెండా అంశాల్లో చేపట్టిన పనులు, పూర్తయినవి, ట్రాఫిక్ సమస్యలు, రోడ్ సేఫ్టీ, వాటర్ లాగింగ్ పాయింట్స్, ఇరుకు రోడ్లకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియంత్రణకు ఆయా రోడ్ల జంక్షన్లలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. అదేవిధంగా ప్రస్తుత సమావేశంలో తీసుకున్న కొత్త ప్రతిపాదనలకు ప్రణాళికలు చేశారు. సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యశాఖలైన ఆర్ అండ్ బీ, మెట్రో రైలు, విద్యుత్, జాతీయ రహదారులు, ట్రాఫిక్, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ, పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర ఇమేజ్ మరింత పెంచేందుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విధంగా గ్రేటర్లో అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. సమావేశంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.