ముషీరాబాద్, ఏప్రిల్ 17: వానాకాలంలో వరద సమస్య తలెత్తకుండా ఓపెన్ నాలాలు, పైపులైన్లలో పూడిక తీత పనులు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు మొదలుపెట్టారు. పూడిక తొలగించడమే కాకుండా ఇక నుంచి ఏడాది పొడవునా నాలాలు, పైపులైన్ల నిర్వహణ చేపట్టేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా వర్షాకాలానికి ముందు నాలాలు, వరద నీటి పైపులైన్లలో పూడికతీసి చేతులు దులుపుకోకుండా ఏడాది పొడవునా నిర్వహణను గుత్తేదారులే చేపట్టేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన నాలాలు, వరద నీటి పైపులైన్లలో రూ.1.70 కోట్ల వ్యయంతో చెత్త, పూడికతీత పనులు మొదలు పెట్టిన అధికారులు. సదరు పనులు చేపడుతున్న గుత్తేదారులే ఏడాదిలో తిరిగి ఎప్పుడు పూడిక, చెత్త సమస్య తలెత్తినా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే నాలాలు, పైపులైన్లలో పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్న అధికారులు వచ్చే జూన్ ప్రారంభం నాటికి పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
నియోజకవర్గంలోని అడిక్మెట్, ముషీరాబాద్ డివిజన్లలోని ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు ప్రధాన నాలాల్లో పూడిక తీత పనులను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇందులో ప్రధానం నాగమయ్యకుంట, అచ్యుత్రెడ్డి మార్గ్, బృందావన్ కాలనీ, అంబర్నగర్ కట్ట, లక్ష్మమ్మ పార్కు, అంజయ్యనగర్, రాంనగర్ బ్రిడ్జి ముషీరాబాద్ డివిజన్లోని బాపూజీనగర్, గంగపుత్ర కాలనీ, వినోబానగర్, జాంబవీనగర్, ఆదర్శ అపార్టుమెంటు ప్రాంతాల్లో పనులు విభజించి గుత్తేదారులకు అప్పగించి పూడిక తొలగిస్తున్నారు.
భారీ వర్షాలు కురిసిన ప్రతి సారి నాలా పరీవాహక ప్రాంతాలు సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఈ సారి వానాకాలంలో వరద నీటి సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు మున్సిపల్ డివిజన్లలో ఓపెన్ నాలా, వరద నీటి పైపులైన్లలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన పూడిక, చెత్తను తొలగిస్తున్నారు. దాదాపు 6 కిలోమీటర్ల మేర ఓపెన్ నాలాలు, ఐదు కిలో మీటర్ల మేర వరదనీటి పైపులైన్లలో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు. పూడిక తొలగిపు పనులను పలు విభాగాలుగా విభజించి కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ వర్షాకాలం మొదలయ్యే లోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలా ప్రహరీలకు నిర్మాణం, మరమ్మతులు చేపట్టడంతోపాటు ప్రధాన నాలాల్లో జేసీబీలు, ఇతర చిన్న చితకా, నాలా, పైపులైన్లలో సిబ్బంది, బకెట్ క్లీనింగ్ ద్వారా పనులు చేపడుతున్నారు.
ప్రస్తుతం నాలాలు, వరద నీటి పైపులైన్లలో పూడిక, చెత్త తొలగించడంతో పాటు ఏడాదిలో ఎప్పుడు అవసరమైనా మళ్లీ పూడిక తీతపనులు చేపడుతాం. ప్రస్తుతం చేపడుతున్న పూడిక తొలగింపు పనులు వచ్చే నెల చివరి నాటికి పూర్తి చేస్తాం. వరద నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతాం.
– సన్నీ, డిప్యూటీ ఈఈ జీహెచ్ఎంసీ సర్కిల్-15