హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చివేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం కూల్చివేతకు సంబంధించి అధికారులు టెండ్లరు ఆహ్వానించారు. 1890 చదరపు అడుగుల్లో ఉన్న డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనం కూల్చివేతకు రూ.38.86లక్షలతో టెండర్లను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది.
కూల్చివేతకు అధునాతన యంత్రాలను వాడాలని, చుట్టుపక్కల వారికి ప్రమాదం జరుగకుండా కూల్చాలని సూచించారు. ఈ నెల 19న డెక్కన్ స్టోర్స్ ఉన్న ఐదంతస్తుల భవనం మంటల్లో చిక్కుకున్నది. క్రీడలకు సంబంధించిన వస్తు, సామాగ్రి విక్రయించే స్పోర్ట్స్ స్టోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి పై అంతస్తులు వ్యాపించాయి. భవనంలో ఎక్కువ శాతం ప్లాస్టిక్, రెగ్జిన్, కాటన్ మేడ్ ఫ్యాబ్రిక్ క్రీడలకు సంబంధించిన వస్తు సామగ్రి ఉండడంతో భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు చెలరేగిన మంటలు రాత్రి వరకు అదుపులోకి వచ్చాయి.
దాదాపు 20కిపైగా ఫైరింజన్లు, పెద్ద సంఖ్యలో జీహెచ్ఎంసీ నీటి ట్యాంకులతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు రెండు రోజుల పాటు భవనంలోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మంటల్లో చిక్కుకొని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. భారీ మంటల ధాటికి భవనం ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో భవనాన్ని పరిశీలించిన అధికారులు కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కూల్చివేతకు టెండర్లను ఆహ్వానించింది.