e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ ఉల్లంఘనులపై ఉక్కుపాదం

ఉల్లంఘనులపై ఉక్కుపాదం

ఉల్లంఘనులపై ఉక్కుపాదం
 • నిర్మాణాల వద్ద డిస్‌ప్లేలో అనుమతి ప్లాన్‌ తప్పనిసరి
 • అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ‘స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌’ ఏర్పాటు
 • సర్కిళ్ల వారీగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌
 • అక్రమాల నిర్ధారణకు 74మంది న్యాక్‌ ఇంజినీర్లు
 • తనిఖీలో ట్యాబ్‌తో ఫొటోలు, జియోలోకేషన్‌, పక్కా ఆధారాలతో రిపోర్టు
 • కూల్చివేతల ఖర్చంతా అక్రమదారుడిపైనే
 • మళ్లీ అనధికారిక నిర్మాణం జరిపితే మూడేళ్ల జైలు, లేదా భూమి విలువలో 25శాతం జరిమానా
 • కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చిన కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌

పొందే అనుమతి ఒక్కటి.. కట్టే భవనం మరొక్కటి.. లెక్కా ఉండదు.. పత్రం ఉండదు. ఇలా నగరంలో అనేకంగా వెలుస్తున్నాయి. భవన నిర్మాణ దారులు, బిల్డర్లు ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మిస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకూ వీరి ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. అందుకు సర్కిళ్ల వారీగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. సమాచారం, ఫిర్యాదు వస్తే చాలు.. వెంటనే అక్కడ వాలిపోయి.. పూర్తి వివరాలతో సర్వే చేపట్టి అక్రమమా.. సక్రమమా..? తేల్చేస్తారు. ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపుతారు. అయితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జారీ చేసిన నూతన నిబంధనలతో బిల్డర్లు, అక్రమనిర్మాణ దారుల్లో వణుకుమొదలైందని తెలుస్తున్నది.

నిబంధనలు ఉల్లంఘించే బిల్డర్లు.., నిర్మాణ దారులు జర జాగ్రత్త.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా అనుమతి పొంది నిర్మాణ సమయంలో రూల్స్‌ బ్రేక్‌ చేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని వెంటనే కూల్చివేసేందుకు ‘స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌’ ను ఏర్పాటు చేస్తూ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటుతో పాటు నిబంధనల ఉల్లంఘనలపై కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ కమిషనర్‌ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణలో సర్కిళ్ల వారీగా ఎన్‌ఫోర్స్‌ బృందాలు అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నారు.

అనుమతి పత్రం.. డిస్‌ప్లే చేయాలి.!

ఇక నుంచి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందిన నిర్మాణదారు తమ భవన నిర్మాణాల వద్ద అనుమతి పొందిన ప్లాన్‌ (సాంక్షన్‌ ప్లాన్‌) డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. సంబంధిత నిర్మాణానికి సంబంధించి సమగ్ర వివరాలతో ఉన్న ప్లాన్‌ను సైట్లలో పొందుపర్చడం ద్వారా కొనుగోలుదారుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ నిబంధన ఖచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో సదరు బిల్డర్‌పై కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వులో హెచ్చరికలు జారీ చేశారు.
కూల్చివేతకయ్యే ఖర్చు..

యజమాని నుంచే వసూలు

అంతేకాకుండా అక్రమ నిర్మాణం కూల్చివేతకయ్యే వ్యయాన్ని కూడా లెక్కగట్టి, భవన యాజమానుల నుంచే వసూలు చేసే చర్యలు చేపడుతుంది. మళ్లీమళ్లీ అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి భూమి విలువలో 25 శాతం జరిమానా విధించే హక్కు.. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌కు ఉంటుంది. లేదా ఉల్లంఘనులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే టీఎస్‌-బీ పాస్‌ ద్వారా నిర్మాణ రంగ అనుమతులను సరళీకృతం చేసిన ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనులపై ప్రత్యేక నిబంధనలను ఆమల్లోకి తీసుకురావడం గమనార్హం.

తనిఖీలకు 74 మంది న్యాక్‌ ఇంజినీర్లు

అక్రమ నిర్మాణాలపై ప్రజలు అందించిన ఫిర్యాదులతో పాటు జోన్‌ పరిధిలో అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలు, అనుమతి పొంది నిబంధనల ఉల్లంఘనలతో జరుగుతున్న నిర్మాణాలపై టాస్క్‌ఫోర్స్‌ తగిన చర్యలు తీసుకుంటుంది. క్షేత్రస్థాయి తనిఖీలకుగాను న్యాక్‌ ఇంజినీర్లను నియమించారు. 30 సర్కిళ్లకుగాను ఒక్కొక్కరికీ మూడు నుంచి నాలుగు వార్డుల బాధ్యతలు అప్పగించారు. మొత్తం 74 మంది ఔట్‌సోర్సింగ్‌ ఇంజినీర్లను తీసుకున్నారు. వీరికి ప్రత్యేక ట్యాబ్‌లు ఇచ్చారు. రోజూవారీ క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా సంబంధిత అక్రమ నిర్మాణం ఫొటో, జియోలొకేషన్‌, ఇతర వివరాలను నోడల్‌ అధికారికి అందజేస్తారు. ఈ రిపోర్టు ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ టీం చర్యలు తీసుకుంటుంది.

మరికొన్ని అంశాలను పరిశీలిస్తే…

 • స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆరు జోన్లకుగాను ఒక్కో జోన్‌కు అవసరమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌ను నియమిస్తుంది.
 • ప్రతి జోన్‌లో రెండు బృందాలుగా విభజించి టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు.
 • ఈ టీమ్‌లో టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో పాటు డీఈలు, ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఔట్‌సోర్సింగ్‌ ఇంజినీర్లను నియమించారు.
 • అక్రమ నిర్మాణాలపై ట్విట్టర్‌, కాల్‌సెంటర్‌, నేరుగా వచ్చిన ఫిర్యాదులపై తనిఖీలు నిర్వహిస్తారు.
 • అక్రమం అని తేలితే సంబంధిత భవనాన్ని కూల్చివేయడం లేదా సీల్‌ చేస్తారు.
 • కూల్చివేతకు ముందుగా పంచనామా నిర్వహించడంతో పాటు సదరు నివేదిక ప్రతిని బిల్డర్‌కు తగిన అక్నాలెడ్జ్జ్‌మెంట్‌తో ఇస్తారు. కూల్చివేతల సమయంలో ఫొటోలు, వీడియోలు రికార్డు చేయనున్నారు.
 • అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు కూడా తెలుపాల్సి ఉంటుంది. తద్వారా వారు వాటిని ప్రొహిబిటరీ రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు విద్యుత్‌, నీటి కనెక్షన్లు ఇవ్వకుండా సంబంధిత శాఖలకు సమాచారమిస్తారు.

స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌లో వీరే..

 • స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగాధిపతిగా జోనల్‌ కమిషనర్‌ వ్యవహరిస్తారు.
 • నోడల్‌ ఆఫీసర్‌గా జాయింట్‌/డిప్యూటీ కమిషనర్‌, సభ్యులుగా పోలీస్‌ శాంతిభద్రతల విభాగం నుంచి డీసీపీ, జీహెచ్‌ఎంసీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఉంటారు.
 • అక్రమ నిర్మాణాలకు సంబంధించి చర్యలు తీసుకునేందునే ఈ స్పెషల్‌ టీం పనిచేయనున్నది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉల్లంఘనులపై ఉక్కుపాదం

ట్రెండింగ్‌

Advertisement