DRF | సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్దమైంది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది ప్రజలకు ఎలాంటి ముంపు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా 30 ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దింపారు. ముంపు సమస్యలను నివారించేందుకు, బాధితులను రక్షించేందుకు సుశిక్షితులైన సిబ్బందితో ఈవీడీఎం సిద్ధంగా ఉందని, వచ్చే అక్టోబరు నెలాఖరు వరకు ఒక్కో సర్కిల్‌కు ఓ డీఆర్ఎఫ్ బృందాన్ని నియమించినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
గ్రేటర్ వ్యాప్తంగా పడవలు, రక్షణ సామాగ్రితో డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూం ద్వారా నిరంతరం ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. ఎస్ఎన్డీపీ పనులు వచ్చే 15 రోజుల్లోగా పూర్తవుతాయని పేర్కొన్నారు. బుద్ధభవన్‌లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాన్సూన్ యాక్షన్‌ప్లాన్ వివరాలను ప్రకాశ్ రెడ్డి వివరించారు. సాయం అవసరమైన పౌరులు 040-29555500, 900113667 నంబర్లలో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.
Drf Team Uppal X Road Gbr
ముఖ్యమైన అంశాలు
అత్యవసర బృందాలను ఏర్పాటు చేసిన ప్రాంతాలివే
రాజ్‌భవన్, జీవీకే మాల్, ఫతుల్లాగూడ, గుడి మల్కాపూర్, కూకట్పల్లి జంక్షన్, మలక్‌పేట, ఉప్పల్, మెట్టుగూడ, శిల్పారామం, సీఎం క్యాంపు కార్యాలయం, ఓయూ క్యాంపస్, షేక్‌పేట, చంపాపేట, మియాపూర్ మెట్రో స్టేషన్, ఎల్బీనగర్, ఈసీఐఎల్, బయో డైవర్సిటీ పార్కు, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి స్టేడియం, సుజనా ఫోరం మాల్, సుచిత్ర, సెక్రటేరియట్, వనస్థలిపురం, మెహిదీపట్నం, మరో మూడు ప్రాంతాలలో అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు.