సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) /చిక్కడపల్లి : బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు ఉద్యమిస్తుంటే.. బస్సు పాస్ చార్జీలు పెంచి పేద బిడ్డల చదువుపై భారం మోపడం అన్యాయమని తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల బస్సు పాస్ చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ వద్ద మంగళవారం మెరుపుధర్నా చేపట్టారు.
“వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన.. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం” అంటూ నినాదాలతో బస్సు భవన్ అట్టుడుకింది. విద్యార్థుల బస్సుపాస్ ధరలు రూ.400 నుంచి రూ.600 పెంచి వారి చదువులతో చెలగాటమాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరైంది కాదని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో విద్యార్థులపై ఎలాంటి భారం మోపలేదని గుర్తు చేశారు. బ స్సుల సంఖ్యను పెంచకుండా ప్రభు త్వం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇంకెంత దిగజారుతావు అంటూ విమర్శించారు. పేదపిల్లలు ఉపయోగించుకొనే బస్సు పాస్‌ల ధరలు పెంచడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.