శామీర్‌పేట,డిసెంబర్27: మండల కేంద్రానికి దూరం గా ఉన్న శామీర్‌పేట మండలం యాడారం గ్రామానికి ‘గౌరీ ఫౌండేషన్’ ఆరోగ్య పరంగా చేయూతనిస్తుంది. యాడారం గ్రామ సర్పంచ్ సుజాత సహకారంతో సీఎంఆర్, మెడికవర్, ఎల్వీ ప్రసాద్ లాంటి కార్పొరేట్ వైద్యశాలలతో కలిసి ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. ఆరోగ్య శిబిరాలతో చుట్టపు చూపుగా వచ్చి పోవడం కాకుండాగ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంపూర్ణ ఆరోగ్యానికి పాటుపడుతుంది. చిన్నారులు, మహిళలు, గర్భిణులకు అవసరమైన సేవలను ఉచితంగా అందజేస్తోంది. నేత్ర శస్త్ర చికిత్సలను సైతం చేయిస్తూ అండగా నిలుస్తోంది.
గౌరీ ఫౌండేషన్-యాడారం పంచాయతీ సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో గ్రామస్తులకు కంటి, గర్భిణి, పిల్లలకు సంబంధించిన వైద్య సేవలు, ఆపరేషన్లను ఉచితం2గా చేయిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 25న సంయుక్తంగా యాడారం గ్రామంలో హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇప్పటికే సీఎంఆర్, మెడి కవర్ హాస్పిటల్స్ వైద్యులతో వైద్య సేవలు, టెలీమెడిసిన్, క్యాంప్‌లు నిర్వహించారు. గ్రామంలో ఇప్పటికే ఏడుగురికి ఎల్వీ ప్రసాద్ దవాఖానలో కంటి పరీక్షలు చేయించగా మరో 12 మందికి కంటి ఆపరేషన్ చేయనున్నారు.రాబోయే రోజుల్లో మురహార్పల్లి, రాజబొల్లారం చిన్నతండా, తదితర గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆలోచనతోనే ‘గౌరీ ఫౌండేషన్’ ప్రారంభించాం. శామీర్‌పేట పరిసర ప్రాంతాల్లో ఎన్నో వైద్య సేవలు, ఆరోగ్యం,పరిశుభ్రతపై అవగాహన నిర్వహించాం.గ్రామీణ ప్రాంతాలు వైద్య సేవలకు ఎంతదూరంగా ఉన్నాయో గమనించాను. అప్పుడే నిర్ణయం తీసుకున్నా కొన్ని గ్రామాలను గుర్తించి మెరుగైన వైద్య సేవలందించాలని. ప్రస్తుతం గౌరీ ఫౌండేషన్ ద్వారా యాడారం గ్రామానికి ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకొన్నా. కంటి, గర్భసంబంధ, చిన్నపిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నాం.
-లలిత, వ్యవస్థాపకురాలు, గౌరీ ఫౌండేషన్
నన్ను సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత. యాడారం ప్రజలు పడుతున్న సమస్యను గుర్తించి గౌరీ ఫౌండేషన్ నిర్వాహకులు హెల్త్ సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. వెంటనే భవనాన్ని కేటాయించాం.హెల్త్ సెంటర్లో సీఎంఆర్, మెడికవర్, ఎల్వీప్రసాద్ దవాఖానల సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే చాలా మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. -సుజాత, సర్పంచ్ యాడారం.