సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారిపోతున్నది. ప్రపంచంలోనే అత్యంత చారిత్రక, గొప్ప నగరాల్లో ఒకటైన భాగ్యనగరం స్వచ్ఛతలో దిగజారిపోతున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పేరుగాంచింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అభివృద్ధి, పరిసరాల శుభ్రత, స్వచ్ఛతను గాలికొదిలేయడంతో నగరం వీధులు మురికి కూపంలా తయారవుతున్నాయి.
ఏ రోడ్డును చూసినా కాలనీలోని వీధులను చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ట్రాఫిక్, కాలుష్యం.. మరోవైపు చెత్త, పొంగిపొర్లుతున్న మురుగుతో నగర పరిసరాలు మలినమైపోతున్నాయి. నగర వీధుల్లో కాలుష్యం తాండవిస్తున్నది. నాలాల్లో కాలుష్య కారకాలు చే రిపోయి ఎక్కడ చూసినా దుర్వాసన వెదజల్లుతున్నది. రాడికల్ స్టోరేజీ అనే ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ సర్వేలోనూ ఇదే వెల్లడైంది. చెత్త నిర్వహణ, కాలుష్యం, పరిసరాల శుభ్రతపై ప్రపంచంలోని ప్రముఖ నగరాల పరిస్థితిపై ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో 18వ అత్యంత చెత్త నగరం గా హైదరాబాద్ నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత మురికి నగరాల జాబితాలో విశ్వనగరం 18వ స్థానంలో ఉంది.
రాడికల్ స్టోరేజీ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని పర్యాటకులు, ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని గూగుల్ రివ్యూల్లో సంబంధిత నగరం పరిశ్రుభంగా,కాలుష్య రహితంగా ఉంటే ‘క్లీన్’ అనే పదంతో అపరిశుభ్రంగా ఉండి కాలుష్యం వెదజల్లేలా ఉంటే ‘డర్టీ’ అనే పదాన్ని అభిప్రాయాల్లో నమోదు చేసేలా సర్వే చేసింది. ఆయా నగరాల్లోని పర్యాటకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అదేవిధంగా నగరాల్లో నిత్యం ప్రయాణిస్తూ పరిసరాలను పరిశీలించే వారి ద్వారా రివ్యూలు తీసుకుంది. ఈ సర్వేలో యూరోపియన్ నగరాలు ప్రథమ స్థానాల్లో ఉండగా ఏషియన్ నగరాల్లో ఒక్కటైన హైదరాబాద్ 18వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, కాలుష్య నియంత్రణ సరిగ్గా లేకపోవడం వల్ల అత్యంత మురికి నగరాల జాబితాలో చేరినట్లు రాడికల్ స్టోరేజీ సంస్థ వెల్లడించింది.