Ganja | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఏపీ మహిళను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. షోలాపూర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరిలో ఒకరు పట్టుబడగా, మరొకరు పరారీ అయ్యారు.
పట్టుబడిన మహిళను ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరుకు చెందిన బీ లక్ష్మి(40) గా పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద నుంచి 7.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ. 3.94 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు. పరారైన వ్యక్తిని షోలాపూర్‌కు చెందిన బోన్యాగా గుర్తించారు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, గతంలో అతనిపై గంజాయి కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
అయితే గంజాయి తరలించినప్పుడల్లా లక్ష్మీకి రూ. 3 వేలు బోన్యా ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది. షోలాపూర్‌లో బోన్యా గంజాయిని విక్రయిస్తూ జీవితం కొనసాగిస్తున్నట్లు తేలింది.