వెంగళరావునగర్, జనవరి 11: గంజాయి గ్యాంగ్‌ను ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ పీవీ రాంప్రసాదరావు కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా రాయకోడూరు గ్రామానికి చెందిన జీవన్ కుమార్ బాపూనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. మిత్రుడు అశోక్ కూడా అతడితో పాటు ఉండేవాడు. ఈ క్రమంలో తేలిగ్గా డబ్బులు సంపాదించడం, అప్పులు తీర్చడం కోసం గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. మిత్రుడైన సత్యశ్రీ, పవన్‌కు కూడా విషయం చెప్పారు.
వీరంతా కలిసి మణితేజ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసే వారు. కిలో గంజాయి రూ.20 వేలకు కొనుగోలు చేసి బాపూనగర్‌లోని తమ గదిలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసేవారు. వీటిని రూ.500కు ఒకటి చొప్పున అవసరమైన వారికి విక్రయించేవారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. నిందితులు జీవన్‌కుమార్, అశోక్, సత్యశ్రీ, పవన్‌ను అరెస్ట్ చేశారు.