Ganja Batch | కుత్బుల్లాపూర్, ఆగస్టు 17 : కుత్బుల్లాపూర్‌లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి బ్యాచ్‌ని పట్టుకునేందుకు వచ్చిన హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సమక్షంలో ఓ యువకుడిపై సర్జికల్ బ్లేడ్‌తో జరిగిన దాడి సంచలనంగా మారింది. కాగా ఇదే ఘటనపై గాయాలపాలైన భాదితుడి కుటుంబ సభ్యులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీడిమెట్ల పోలీస్టేషన్లో ఫిర్యాదులు చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇరువురు స్థానిక పోలీస్టేషన్లో చేసిన ఫిర్యాదుల ఆధారంగా.. ఈ నెల 16న రాత్రి సమయంలో కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో హాష్ ఆయిల్ గంజాయిని విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిహెచ్.కోటమ్మ నేతృత్వంలో దాడులు చేపట్టారు. ఈ దాడిలో హేమంత్, నితిష్, రవితేజా, చరణ్‌ను విచారిస్తున్న క్రమంలో కుత్బుల్లాపూర్ వెంకటేశ్వరనగర్ కాలనీకి చెందిన బి.చంటియాదవ్(28) తన పనులు ముగించుకొని అటువైపు నుండి వస్తుండగా పోలీసులకు గంజాయి విక్రయదారులకు మధ్య జరుగుతున్న పెనుగులాటలో జోక్యం చేసుకోవడంతో అకస్మాత్తుగా చంటియాదవ్ తలభాగంలో చెవిపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి జరిగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా 15 కుట్లు పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు…?
ఇదే ఘటనపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో భాదిత కుటుంబంతో పాటు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిహెచ్.కోటమ్మలు ఇచ్చిన ఫిర్యాదులు తీవ్ర చర్చానీయంశంగా మారింది. గాయాలపాలైన భాదితుడి అన్న ప్రవీన్ కుమార్ ఎక్సైజ్ అధికారులు గంజాయి బ్యాచ్‌కు వత్తాసు పలుకుతూ తమ సోదరుడు చంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా విధినిర్వాహణలో తమ విధులకు పూర్తిగా ఆటంకం కలిగించారని హేమంత్, నితిష్, రవితేజా, చరణ్‌తో పాటు ఇతరులపై ఇన్స్పెక్టర్ సిహెచ్. కోటమ్మ ఫిర్యాదు చేసింది.
ఇన్ఫార్మర్ అనే నేపంతో దాడి జరిగిందా..!
కాగా భాదితుడు పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని, తమ గుట్టును పోలీసులకు చేరవేయడంతోనే గంజాయి బ్యాచ్ ఈ దాడికి పాల్పడ్డారా అనే ప్రశ్నలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే సర్జికల్ బ్లేడ్లు గంజాయి బ్యాచ్ వద్దనే ఉంటాయో తప్పా పోలీసుల వద్ద ఎందుకు ఉంటాయని, పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పుడు గంజాయి బ్యాచ్‌ని ఎందుకు పట్టుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనపై ఇటు పోలీసుల అత్యుత్సాహంతో పాటు అటు గంజాయి బ్యాచ్ ఆగడాలే ఈ సంఘటనకు దారితీశాయంటూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇదిలా ఉండగా జీడిమెట్ల పోలీసులు తమకేమి తెలియదన్న చందనంగా ఇరువురు ఎఫ్ఐఆర్ కాఫీలు మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఇతర సంఘటనలు జరిగిన సమయంలో ఎఫ్ఐఆర్ కాఫీలను బహిర్గతం చేయకుండా ఉండే పోలీసులు ఈ సంఘటనతో నేరుగా ఇరువురికి సంబంధించిన ఎఫ్ఐఆర్ లు బహిర్గతం కావడం విశేషం.