సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 27: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఓ ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీసీ రావుల గిరిధర్, ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్ కె.మత్తు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన గుంజి రామాంజనేయులు, గోగుల గోపాల కృష్ణ, షేక్ కాసినపల్లి భాషా ఓ ముఠాగా ఏర్పడ్డారు. నగరంతో పాటు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను తస్కరించి.. కింగ్‌కోఠిలో విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. ఇటీవల కాచిగూడ చౌరస్తాలో చేపట్టిన తనిఖీల్లో ముగ్గురు కలిసి దొంగిలించిన రెండు బైకులపై కింగ్‌కోఠి వైపు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపకపోవడం, పొంతనలేని సమాధానాలు చెప్పడంలో పోలీసులు విచారించగా నేరాలు అంగీకరించారు. నగరం, సూర్యాపేట జిల్లాలో వాహనాలు చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితులు రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. బయట ఉన్న వాహనాలను ఎంపిక చేసుకుని.. ఇగ్నిషన్తో బ్యాటరీని కనెక్ట్ చేసి చోరీకి పాల్పడుతున్నారు. దొంగిలించిన వాహనాలను ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉంచి.. అక్కడి నుంచి కింగ్‌కోఠికి తరలించి విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటాని డీసీపీ తెలిపారు.