సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను సీసీఎస్ భువనగిరి, మోత్కూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి రూ. 32.83 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యాద్రాది భువనగిరి జిల్లా, వలిగొండకు చెందిన బోడ్గె అశోక్ అలియాస్ డీఎస్పీ అశోక్ వృత్తిరీత్యా డ్రైవర్. ఇతడితో బైరవోని స్వామి, చిట్యాలకు చెందిన గుండెబోయిన చంద్రమ్, నూతి సతీశ్, బడే బాలకృష్ణ, నార్కెట్పల్లికి చెందిన గండసిరి ఉపేందర్లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గ్రామాల్లో తాళాలు వేసిన ఇండ్లను దొంగతనానికి ఎంచుకొని, మద్యం తాగి దొంగతనానికి వెళ్తారు. ప్రధాన నిందితులు దొంగతనం చేస్తుండగా, ముఠాలోని మిగతావారు ఇంటి బయట ఉండి కాపలా కాస్తారు. ఈ ముఠాలోని సభ్యులు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. 2007 నుంచి దొంగతనాలు చేస్తున్నారు. ఒకరు జైలుకు వెళ్లినా బయట ఉన్న వాళ్లు దొంగతనాలు చేస్తారు. 2022లో ప్రధాన నిందితులను మునుగోడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తమ ముఠాతో కలిసి రాచకొండ, నల్గొండ జిల్లాలో దొంగతనాలు చేశారు. విచారణలో మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూర్, వలిగొండ, రామన్నపేట్, యాదగిరిగుట్ట, రాజాపేట, నకిరేకల్, తొర్రూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో 34 దొంగతనాలు చేసినట్టు ముఠా సభ్యులు ఒప్పుకున్నారు. ఈ ముఠాను అరెస్ట్ చేసి 50 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, క్రైమ్స్ డీసీపీ శ్రీబాల, అదనపు డీసీపీ లక్ష్మి పాల్గొన్నారు.