హిమాయత్‌నగర్,ఆగస్టు25: వాహనం పైనుంచి కిందపడిన భారీ వినాయక విగ్రహం ధ్వంసమైన సంఘటన దోమల్‌గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమల్‌గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్కేసర్లో గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఓ వాహనంలో ఆ భారీ విగ్రహాన్ని తీసుకొస్తుండగా హిమాయత్‌నగర్‌లోని వీధి నెం.5లో మూల మలుపు వద్ద వాహనంపై నుంచి కింద పడింది. దీంతో వాహనంపైన ఉన్న బీహార్‌కు చెందిన గోల్‌మార్(25) అనే యువకుడు కిందపడిపోవడంతో అతని ఎడమ కాలుకు బలమైన దెబ్బలు తగిలాయి.
దీంతో ఆ యువకుడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనలో మూడు ద్విచక్ర వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో హిమాయత్‌నగర్‌లో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న దోమల్‌గూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కిందపడిన భారీ వినాయక విగ్రహాన్ని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.