సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో గణనాథుడి సందడి మార్మోగుతోంది. ఆనందోత్సాహాల మధ్య భక్తులు ఆట, పాటలతో మండపాల వద్ద హుషారుగా గడుపుతున్నారు. సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్నరకాల విఘ్నేశ్వరులు తీరొక్క ఆకారంలో అలరిస్తున్నాయి.
భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకుంటున్నారు. సర్వ విఘ్నాలను తొలిగించే ఆది దేవుడు గణపతికి పూజలు చేస్తున్నారు. ఆయా మండపాల వద్ద కాషాయపు జెండాలతో, విద్యుత్ అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి రోజు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీలు.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్ తదితర నిమజ్జన వేదికల వద్ద గణనాథుల సందడి కనిపిస్తున్నది.
భక్తులు తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న గణనాథులను కుటుంబసభ్యులతో కలిసొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. ఇంకోవైపు శోభాయాత్ర రోజున అవసరమయ్యే వాహనాలను రవాణా శాఖ ఏర్పాటు చేస్తున్నది. గ్రేటర్లో 2 వేల వాహనాలు సమకూర్చనున్నది. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు సమావేశం నిర్వహించి తమ తమ పరిధిలో ఉత్సవ కమిటీల సూచనల మేరకు వాహనాలను సమకూర్చనున్నట్టు అధికారులు తెలిపారు.