e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home హైదరాబాద్‌ సర్వం సన్నద్ధం

సర్వం సన్నద్ధం

 • రేపు వినాయక నిమజ్జన ఘట్టం
 • గణేశ్‌ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి
 • ట్యాంక్‌బండ్‌తో పాటు చెరువుల వద్ద ప్రత్యేక వసతులు
 • నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహిస్తాం
 • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
 • నీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు: మేయర్‌ విజయలక్ష్మి

సిటీబ్యూరో, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ ) : గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. శుక్రవారం ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, కలెక్టర్‌ శర్మన్‌, జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. సత్యనారాయణ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, ఆర్టీఏ తదితర శాఖల అధికారులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో అధికారులతో ఏర్పాట్లపై మంత్రి తలసాని, మేయర్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధి సరస్వతీనగర్‌ కాలనీ సమీపంలోని పెద్దచెరువును మేయర్‌ పరిశీలించారు.

320 కి.మీ.లలో శోభాయాత్ర

ఆదివారం జరుగనున్న గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని పేరొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే గణేశ్‌ శోభాయాత్రకు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 320 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి సుమారు 19వేల మంది వివిధ స్థాయిల్లోని పోలీసు సిబ్బంది విధులలో పాల్గొంటారని, ప్రతి క్రేన్‌ వద్ద, ప్రతి విగ్రహం వెంట ఒక పోలీసు అధికారిని నియమిస్తామని చెప్పారు. వాహనదారులు, భక్తులకు ఇబ్బంది లేకుండా లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, ఆర్‌ అండ్‌ బీ అధికారుల సమన్వయంతో ట్రాఫిక్‌ డైవర్షన్‌కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖైరతాబాద్‌ వినాయకుడిని నిమజ్జనం చేసే క్రేన్‌ నెంబర్‌ 6 వద్ద హుస్సేన్‌సాగర్‌లో పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి ఆర్టీఏ ఆధ్వర్యంలో వెయ్యి వాహనాలను అందుబాటులో ఉంచామని, అవసరమైనవారు వినియోగించుకోవాలన్నారు. వాహనాల పర్యవేక్షణకు 10 మంది ఆర్టీఏ అధికారులు, 50 మంది మోటార్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులను నియమించినట్లు మంత్రి చెప్పారు.

565 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

 • భక్తుల సౌకర్యానికి 31 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు
 • అర్థరాత్రి తర్వాత కూడా అందుబాటులో బస్సులు
- Advertisement -

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 17 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 19న గ్రేటర్‌లో జరుగనున్న గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 31 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు, ప్రతి డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటించారు. గణేశ్‌ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. ఆర్టీసీలో ప్రయాణం చేసే భక్తులకు ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు ఇద్దరు అధికారులను నియమించనున్నారు. జాయింట్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద మరో ఎనిమిది మంది అధికారులను ఏర్పాటు చేశామన్నారు. రిలీవ్‌ వ్యాన్లు మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

బాలాపూర్‌ టు ట్యాంక్‌బండ్‌ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన సీపీ బృందం

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 17(నమస్తే తెలంగాణ)/బడంగ్‌పేట : నగరంలో ఆదివారం జరిగే గణేశ్‌ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు, సంబంధిత రూట్లను నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ప్రధాన నిమజ్జనోత్సవ ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో ఆ రూట్‌లో సీపీ బృందం పర్యటించింది. అనంతరం ట్యాంక్‌బండ్‌ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ నిమజ్జన ర్యాలీ జరిగే రూట్‌లో సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. బందోబస్తు ఎలా చేస్తున్నారనే విషయంపై స్థానిక డీసీపీలను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట అదనపు సీపీలు శిఖా గోయెల్‌, డీఎస్‌ చౌహాన్‌, ఐజీ విజయ్‌కుమార్‌, జాయింట్‌ సీపీలు ఏఆర్‌ శ్రీనివాస్‌, విశ్వప్రసాద్‌, ఎం.రమేశ్‌, డీసీపీలు కల్మేశ్వర్‌, గజారావు భూపాల్‌, ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు తదితరులు ఉన్నారు.

19న ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లు

 • సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 17 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 19న గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అధికారులు ప్రకటించారు. ఈ నెల 19న రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 20 తెల్లవారుజాము 4:00 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
 • సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ (19న 23:30 నుంచి ఈ నెల 21న 00:05 వరకు)
 • హైదరాబాద్‌-లింగంపల్లి ( 20న 00:30 నుంచి 01:20 వరకు )
 • లింగంపల్లి-హైదరాబాద్‌ ( 20న 01:50 నుంచి 02:40 వరకు)
 • హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ ( 20న 03:30 నుంచి 04:00 వరకు)
 • హైదరాబాద్‌-లింగంపల్లి (19న 23:00 నుంచి 23:50 వరకు)
 • లింగంపల్లి-ఫలక్‌నుమా ( 20న 00:10 నుంచి 01:50 వరకు)
 • ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ (20న 02.20 నుంచి 03:40 వరకు)
 • సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ (20న 04:00 నుంచి 04:40 వరకు)

వెంటవెంటనే ప్రతిమల తొలగింపు మేయర్‌ విజయలక్ష్మి

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా విగ్రహ ప్రతిమలను నీటిలో వేసినప్పుడు కలుషితం కాకుండా జీహెచ్‌ఎంసీ పటిష్టచర్యలు చేపట్టినట్లు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. చెరువులో వేసిన వెంటనే ప్రతిమలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు అవసరమైన తాగునీరు, టాయిలెట్స్‌ ను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని మేయర్‌ తెలిపారు.

ఏర్పాట్లు ఇవే..

 • విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్‌ బండ్‌ పరిసరాలలో 40 క్రేన్లు, మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో 330 క్రేన్ల ఏర్పాటు
 • 162 గణేశ్‌ యాక్షన్‌ టీమ్‌ ఏర్పాటు, ఇందులో మొత్తం 8,116 మంది సిబ్బంది నియమించారు.
 • నిమజ్జన వ్యర్థాలను తొలగింపునకు ఎక్స్‌కవేటర్లు 20, జేసీబీలు 21, మినీ టిప్పర్లు 39, 44 వాహనాలు (10 టన్నుల సామర్థ్యం) ఏర్పాటు చేశారు.
 • ట్యాంక్‌ బండ్‌ పరిధిలో అందుబాటులో 32 మంది గజ ఈతగాళ్లు
 • విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లు, 2600 ఎల్‌ఈడీ లైట్లు ట్యాంక్‌ బండ్‌ పరిధిలో ఏర్పాటు. వీటితో పాటు 101 ట్రాన్స్‌ఫారర్ల ఏర్పాటు. హుస్సేన్‌సాగర్‌ ప్రాంతంలో
 • 48ట్రాన్స్‌ఫార్మర్లు, సరూర్‌నగర్‌లో 5 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు. 1,284 వీధిదీపాలను సిద్ధం చేశారు.
 • హుస్సేన్‌సాగర్‌తో పాటు 25 చెరువులు, 25 బేబీ పాండ్స్‌ వద్ద ఏర్పాట్లు
 • శోభాయాత్రలో భక్తులకు తాగునీటికి 30లక్షల వాటర్‌ ప్యాకెట్లను జలమండలి సిద్ధం చేస్తున్నది. అవసరమైన ప్రాంతాలకు
 • ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా చేయనున్నారు.
 • మూడు షిఫ్ట్‌లలో పారిశుధ్య నిర్వహణకు 8700 మంది సిబ్బందిని నియమించారు.
 • ట్యాంక్‌ బండ్‌పై అందుబాటులో 2 అంబులెన్స్‌లు
 • ట్యాంక్‌ బండ్‌పై పోలీసు శాఖ ఆధ్వర్యంలో 2 కంట్రోల్‌ రూమ్‌లు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాటర్‌ వర్స్‌, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో ఒక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.
 • ఆర్‌ అండ్‌ బీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా భారీకేడ్లు, వాచ్‌ టవర్స్‌, వ్యూ కట్టర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement