సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నిర్మించిన ఆరు థియేటర్లు నిర్మాణపు పనులు 95శాతం పూర్తయి అతి త్వరలోనే ప్రారంభానికి సిద్ధ్దమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పేదోడికి ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో గడిచిన పదేళ్లు కేసీఆర్ సర్కార్ సంకల్పించి, జీవం లేక శిథిలమవుతున్న సర్కార్ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో మార్చింది. వాటిలో ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలందించేందుకు అనునిత్యం కృషి చేసింది. ఇందులో భాగంగానే గాంధీ అసుపత్రిలో నోడల్ అవయవదాన మార్పిడి కేంద్రాన్ని రూ.35 కోట్లతో నెలకొల్పేదుకు 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవ మార్పిడికోసం రూ.లక్షల్లో అప్పులు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడిలు చేయించుకోవడం గమనించిన కేసీఆర్ అవసరమైన ప్రతి పేదోడికి ఉచితంగా అవయవమార్పిడి సేవలందించాలని నిర్ణయించారు.
అందులో భాగంగానే నాటి వైద్యారోగ్యశాఖ మంత్రి టీ.హరీష్‌రావు.. గాంధీ ఆసుపత్రిలోని 8వ అంతస్తులో అవయవమార్పిడి కేంద్రం ప్రారంభించేందుకు వెనువెంటనే రూ.35కోట్లు మంజూరు చేశారు. అప్పటినుంచి పనులు చకచకా సాగుతుండగా, ప్రభుత్వం మారడంతో మధ్యలో కాస్త నిలిచిపోయాయి. రోగుల అవస్థలు గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆయా పనులను పూర్తిచేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి 95శాతం పనులు పూర్తికాగా మరో పదిహేను రోజుల్లో గాంధీలోని అవయవ మార్పిడి కేంద్రం అందుబాటులోకి రానుంది.
గాంధీలోని ఆధునిక అవయవ మార్పిడి కేంద్రంలో లివర్, మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటి అవయవాల మార్పిడికోసం ఆరు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకేసారి మూడు వివిధ రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చు. అధునాతన హంగులతో నిర్మించిన ఈ అవయవ మార్పిడి కేంద్రంలో సెమినార్ హాల్ నెలకొల్పారు. వైద్య విద్య అభ్యసించే పీజీ విద్యార్థులకు వైద్యవిద్యలో భాగంగా ఆపరేషన్ థియేటర్లో నిర్వహించే అవయవ మార్పిడి చికిత్సను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేశారు.
వీటిలోనే నేరుగా దాత నుంచి గ్రహీతకు అవయవాన్ని అమర్చనున్నారు. ఐసీయూ ట్రాన్సప్లాంటేషన్ గదులు, అబ్జర్వేషన్ రూములు, అవయవ మార్పిడి చికిత్సలందించే కార్డియాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, హెపటాలజీ మొదలైన ఆయా విభాగాల వైద్యులకు సైతం గదులను ఇందులోనే కేటాయించారు. అటోమెటిక్‌గా తెరుచుకునే తలుపులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు లోపలికి రాకుండా నిలువరించేందుకు అవసరమైన పరికరాలను సైతం అమర్చారు.
అవయవ మార్పిడి చికిత్సకోసం సామాన్యుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. కిడ్నీ మార్పిడికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, కాలేయం మార్పిడి రూ.25 లక్షల నుంచి రూ.38 లక్షలవరకు, గుండె మార్పిడికి రూ. 20లక్షల నుంచి రూ.30లక్షల వరకు, ఊపిరితిత్తులమార్పిడికి రూ.20లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బులు కట్టించుకొని సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు. అయితే గాంధీలో ఈ కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల సామాన్యుడు ఉపశమనం పొందుతాడు. అలాగే కేంద్రం ఏర్పాటుతో కేసీఆర్ తరతరాలకు చిరస్థాయిలో నిలిచిపోతారు.