Gandhi Hospital | సిటీ బ్యూరో/బన్సీలాల్పేట, మార్చి10, (నమస్తే తెలంగాణ): గాంధీ జనరల్ ఆసుపత్రి సమస్యలతో సతమతమవుతున్నది. ఆసుపత్రి ప్రాంగణంలో మురుగునీరు ప్రవహిస్తుంటే.. పై అంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్లు పనిచేయడం లేదు.. దీంతో రోగులు , వారి సహాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆసుపత్రిలో పర్యటించినా.. కూడా తీరు మారకపోవడం గమనార్హం.
బాగు చేయించడం విస్మరించారు..
ప్రతి సోమవారం సుమారు 2వేల మంది ఔట్ పేషెంట్లు, మిగతా రోజుల్లో 1500 వరకు వస్తుంటారు. 1200 బెడ్ల సామర్థ్యం గల ఈ ఆసుపత్రికి స్థాయికి మించి ఇన్ పేషెంట్లు వచ్చి చికిత్స తీసుకుంటారు. రెండో అంతస్తులో ఉన్న చర్మ లైంగిక వ్యాధుల ఓపీ విభాగానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయడం లేదు. మొదటి అంతస్తులో ఉన్న పలు ఇనుప కుర్చీలు విరిగిపోయాయి.
మురుగుతో దుర్వాసన
200 పడకల సామర్థ్యంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చికిత్స కోసం వచ్చే బాలింతలు, గర్భిణుల కోసం వారి సహాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సహాయకుల షెల్టర్ సరిపోకపోవడంతో ఆసుపత్రి బయటే రోజుల తరబడి ఉంటున్నారు. మరోవైపు ఆసుపత్రి నుంచి వెలువడే మురుగు నీరు పొంగి బయటికి రావడంతో ఆ పక్కనే విశ్రాంతి తీసుకుంటున్న సహాయకులు ముక్కులు మూసుకుంటున్నారు.