సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నిమజ్జన కార్యక్రమం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఊపందుకుంది. నగర పోలీసులు ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై ఎక్కువగా దృష్టి సారించి, ఇతర విగ్రహాలను త్వరగా తీయాలంటూ ఒత్తిళ్లు చేశారు. అయినా కూడా మండపాల నిర్వాహకులు సాయంత్రం తరువాతే ఏర్పాట్లు చేస్తూ రాత్రి తమ నిమజ్జన కార్యక్రమాలు మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా చార్మినార్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు విగ్రహాలు బారులు తీరాయి. సౌత్‌వెస్ట్ జోన్ పరిధిలో నుంచి వచ్చే వాహనాలు కూడా మోజంజాహి మార్కెట్ నుంచి ప్రధాన ర్యాలీలలో కలువడంతో ఆ ప్రాంతంలోనూ విగ్రహాలు బారులు తీరాయి. ఇలా అర్ధరాత్రి వరకు కూడా భారీగా విగ్రహాలు బారులు తీరడంతో పోలీసులు అనుకున్నదొకటి.. అక్కడ జరిగింది మరొకటి అనే చర్చ జరుగుతోంది. కాగా, బుధవారం ఉదయం వరకు అన్ని విగ్రహాల వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు పంపించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాత్రి రద్దీ ఎక్కువగా ఉండటంతో పిక్ పాకెటర్స్ కూడా జనాలలో కలిసిపోయారు. మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి లక్షలాది మంది తరలిరావడంతో అక్కడ కూడా పిక్పాకెటర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈవ్‌టీజర్లు కూడా మహిళలను వేధించడంతో పలువురు షీ టీమ్స్‌కు పట్టుబడ్డారు. అన్ని ప్రాంతాల్లో షీ టీమ్స్ నిఘా కొనసాగుతోంది.