సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. తాగిన మైకంలో విలువలు మరుస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అసలు మద్యం మత్తులో జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టేందుకు ఓ వ్యక్తి కొంతమంది సామాజిక సేవకుల సాయంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతమందిలోనైనా మార్పు తేవాలన్న సంకల్పంతో ‘జిందగీ ఇమేజెస్’ ఫేస్బుక్ పేజీలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ పేజీలో సుమారు 2 లక్షలకు పైగా సభ్యులు ఉండగా వారికి ఎప్పటికప్పుడు మద్యం అనర్థాలను వివరిస్తూ.. అవగాహన కల్పిస్తున్నారు. పార్టీలు చేసుకోండి.. కానీ ‘మద్యం లేకుండా చూసుకోండి’ అంటూ సూచిస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు యువత, ఉద్యోగులు, సామాజిక వేత్తల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మద్యంపై యుద్ధం..
సామాజిక వేత్త అయిన చెగొండి చంద్రశేఖర్ పేద కుటుంబాల నుంచి సంపన్న వర్గాలు మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులపై అధ్యయనం చేశారు. నేరం చేయడంలో మద్యం ఎలా ప్రేరేపిస్తుందో తెలుసుకున్నారు. మొత్తంగా మద్యం రక్కసితో వేల కుటుంబాలు రోడ్డున పడుతుండటంతో సోషల్ మీడియా వేదికగా లిక్కర్‌కు వ్యతిరేకంగా యుద్ధం మొదలు పెట్టాడు. 2013లో జిందగీ ఇమేజెస్ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. ఇందులో సమాజంలో జరుగుతున్న ఘటనలను వివరిస్తూ ఆలోచనలు రేకెత్తించే చిత్రాలను పోస్టు చేసేవారు. ‘దావత్ వితౌట్ దారు’ అంటూ సూచనలు చేస్తూ.. పార్టీ అంటే లిక్కర్ అనే భావన ఉండొద్దని.. తినాలి.. డ్యాన్స్ చేయాలి.. స్నేహితులు, బంధువులతో ముచ్చటించాలి.. అదే నిజమైన కిక్క్ అంటూ చంద్రశేఖర్ వివరిస్తున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్, నిమ్స్ డాక్టర్ భూషణ్‌రాజు ఇతర ప్రముఖులు ఈ క్యాంపెయిన్‌కు సలహాలు, సూచనలు ఇస్తుండటం విశేషం.
యువతకు నచ్చే రిథంలో..
దావత్ వితౌట్ దారు ఆటలు.. పాటలు.. ముచ్చట్లు‘దావత్ వితౌట్ దారు’తో మద్యం అనర్థాలపై విస్తృత ప్రచారం.. జిందగీ ఇమేజెస్ ఫేస్బుక్లో ఆలోచన రేకెత్తించే ఫొటోలు, పోస్టులు గురించి యువతకు చెప్పేందుకు ‘జిందగీ ఇమేజెస్’ సభ్యులు సృజనాత్మకతకు శ్రీకారం చుట్టారు. వినసొంపైన మ్యూజిక్‌తో పాటలు రూపొందిస్తున్నారు. అంతేకాదు బుర్రకథ ద్వారా కూడా లిక్కర్ నష్టాలపై వివరించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందమైన పదాలతో వినసొంపైన మ్యూజిక్‌తో కుర్రకారుకు లిక్కర్ లేని దావత్‌ను పరిచయం చేయనున్నారు. ప్రతి పార్టీలో ఈ పాటలు మార్మోగేలా చర్యలు చేపడుతున్నారు.