Hyderabad | హైదరాబాద్ : గాజులరామారంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. పేదల ఇండ్లను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేశాయి. దీంతో నిరుపేద చిన్నారులు రోడ్డున పడ్డారు. తమ వస్తువులకు కాపలాగా ఉంటూ ఎండకు ఆకలితో అలమటించిపోతున్నారు. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
బాధిత కుటుంబాల పిల్లలను ఓ జర్నలిస్టు పలుకరించగా.. పొద్దున నుండి అన్నం తినలేదు, ఆకలి అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ నాన్న కిరాయికి ఇల్లు వెతకడానికి వెళ్లారు. మా అమ్మనాన్న అడ్డమీది కూలీలు. పని చేస్తేనే పైసలు వస్తాయి. ఇల్లు కట్టుకునేందుకు కూడా మాకాడ పైసల్లేవు. మా ఇండ్లను పొద్దున కూలగొట్టారు. మా పుస్తకాలు కూడా మట్టిలో కలిసిపోయాయని పిల్లలు చెప్పడం అందర్నీ కలిచివేసింది.
పొద్దున నుండి అన్నం తినలేదు, ఆకలి అవుతుంది
అమ్మ నాన్న కిరాయికి ఇల్లు వెతకడానికి వెళ్లారు
గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలతో నిలువ నీడ లేక అనాధలు అయిన నిరుపేద చిన్నారులు https://t.co/QbRT6igrqj pic.twitter.com/wRx7zXsUkp
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2025
ఈ సందర్భంగా బాధిత మహిళలు బోరున విలపించారు. కుక్కల మాదిరి రోడ్డున పడ్డామని కన్నీరు పెట్టుకున్నారు. హైడ్రా మీద మన్నువడ.. మమ్మల్ని సంపుతున్నరు అని శాపనార్థాలు పెట్టారు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.. ఆ ఇల్లు లేదు, ఉన్న రేకుల గుడిసెను కూడా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పండుగ పూట మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ మొగోళ్ళను పంపడం కాదు.. రేవంత్ రెడ్డి వచ్చి మాతో మాట్లాడాలి. ఓట్లు వేయించుకుని గెలిచి ఇండ్ల కూర్చోవడం కాదు. దమ్ముంటే ఇక్కడికి రేవంత్ రెడ్డి రావాలి. పోలీసోళ్లతోన బతుకమ్మ ఆడుతున్నాం.. పోలీసోళ్లు లాఠీలతో కొట్టి బతుకమ్మ ఆడిస్తున్నారు అని మహిళలు పేర్కొన్నారు.
పండుగ పూట మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. చిన్న గుడిసె వేసుకొని బ్రతుకుతుంటే దాన్ని కూడా కూల్చేశారు. పండుగ పూట మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తలేరు. రేవంత్ రెడ్డి మా దగ్గరికి వస్తే రాళ్లు తీసుకొని కొడతామని గాజులరామారం హైడ్రా బాదితుల ఆగ్రహం వ్యక్తం చేశారు.