సిటీ బ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నగరంలో వర్షం పడితే సైబరాబాద్ అంతా అష్టదిగ్బంధంలో చిక్కుకుంటుంది. చిన్న వర్షం పడినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఇక ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిందంటే అంతే సంగతులు. కార్యాలయాల నుంచి బయటకు రావడం వరకే వారి చేతిలో ఉంటుంది. ఇంటి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితి సైబర్ సిటీ పరిసరాల్లో ఏర్పడుతుంది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, కొత్తగూడ ప్రాంతాల్లో వాహనదారులు అవస్థలు వర్ణనాతీతం.
ఆయా ప్రాంతాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వర్షం పడితే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆఫీస్‌ల నుంచి సాయంత్రం బయటకు వెళితే అర్ధరాత్రి దాకా ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకం చూస్తున్నారు. రోజంతా పని ఒత్తిడితో బయటకు వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్‌లో అంతకు మంచి నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడంతో సైబర్ సిటీలోని ప్రధాన కూడళ్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. ఉద్యోగ భారం కంటే ట్రాఫిక్ భయమే తమను వేధిస్తుందని నిట్టూరుస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ముఖ్యంగా గత రెండేండ్ల నుంచి గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు విభాగం, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపం ప్రధాన కారణమని స్పష్టం చేస్తున్నారు.
సైబరాబాద్ ప్రాంతంలో సిగ్నలింగ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, మరమ్మతుల కోసం తవ్విన గుంతలను సరిగ్గా పూడ్చకపోవడమే ట్రాఫిక్ సమస్యకు కారణమవుతుందని ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. కూడళ్ల వద్ద ఉంటున్న ట్రాఫిక్ పోలీసులు సిగ్నళ్లను ఆటోమెటిక్ మోడ్‌లో ఉంచడం వల్ల రాకపోకల సమతుల్యత దెబ్బతింటుంది. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్లోకి ఉదయం వచ్చే వాహనాలు ఎక్కువగా ఉంటాయి.
ఇతర ప్రాంతాలకు వెళ్లేవి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా సాయంత్రం ఐటీ కారిడార్ నుంచి వెళ్లేవి ఎక్కువగా.. ఇటువైపు వచ్చే వాహనాలు తక్కువగా ఉంటాయి. దానికి అనుగుణంగా సిగ్నలింగ్‌ను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇరువైపులా సూచించే సిగ్నళ్లను సమానంగా ఉంచి ఆటోమేటిక్ మోడ్‌ను పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారని ఐటీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీని కారణంగా రద్దీ ఉన్న మార్గంలో అలాగే ఉండి.. రద్దీ లేని మార్గం ఎల్లప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తున్నదని వాపోతున్నారు. దీని వల్లనే గంటల కొద్దీ రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపిస్తున్నారు.
మరోవైపు.. మరమ్మతుల పేరిట రోడ్లను తవ్వి నామమాత్రంగా పూడ్చడంతో గుంతలు ఏర్పడి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని అంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో సైబర్ సిటీలో గుంతలు ఉండేవి కాదని.. రెండేండ్లుగా పెరిగిపోయాయని చెప్తున్నారు. వర్షాకాలంలో రహదారుల మరమ్మతు పనులు చేయకూడదనే నిబంధన ఉన్నా కూడా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపంతో రోడ్లను తవ్వుతున్నారని ఆరోపిస్తునారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పడుతున్న ఇబ్బందులను చూసైనా అధికారులు, పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. రోజు బోడుప్పల్ నుంచి వస్తాను. వర్షం పడిందంటే విధులకు రావాలంటేనే భయంగా ఉంటుంది. ఆఫీస్‌లో ఉండే పని ఒత్తిడి కంటే ట్రాఫిక్‌లో పడే అవస్థలే ఇబ్బందులు పెడుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు ఒక వైపు ట్రాఫిక్ జామ్ మరోవైపు రోడ్లన్నీ గుంతలమయంతో ఉండటంతో ప్రయాణం ప్రమాదకరంగా సాగుతుంది. మరమ్మతు పనులు చేసి గుంతలను సరిగ్గా పూడ్చకపోవడం, రోజుల తరబడి పనులు కొనసాగించడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో చేసేదేమీ లేక బైక్ దగ్గర్లోని మెట్రో దగ్గర పెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఇంటికెళ్లాక భారీ వర్షం వస్తే ఆ బైక్ కూడా ఉంటుందో వరదలో కొట్టుకుపోతుందో తెలియని పరిస్థితులు హైదరాబాద్ నగరంలో నెలకొన్నాయి.
-కే విజయ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, హైటెక్ సిటీ
లింగంపల్లి, కూకట్ పల్లి ప్రాంతాల నుంచి సైబర్ సిటీకి నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు వస్తారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ నిర్వహణ అధ్వాన్నంగా ఉంటుంది. వర్షం వచ్చిందటే నరకం అనుభవిస్తున్నాం. నాలెడ్జ్ సిటీ నుంచి బయోడైవర్సిటీకి రావడానికి 1 కిలోమీటర్‌కు గంట సమయం పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు రద్దీ ఉండే వైపు నుంచి వెళ్లే వాహనాలకు ఎక్కువ సమయం ఇచ్చి.. తక్కువ ఉండే వైపు వాహనాలకు తక్కువ సమయం ఇస్తే ట్రాఫిక్ జామ్ తలెత్తదు. కానీ పోలీసులు మాత్రం ఇరువైపులా సమాన సమయం ఫిక్స్ చేసి సిగ్నల్స్‌ను ఆటోమెటిక్ మోడ్‌లో ఉంచుతున్నారు. దీంతో సైబర్ సిటీ మొత్తం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. బీఆర్ఎస్ హయాంలో సిస్టమాటిక్‌గా ఉండేది. కానీ ప్రస్తుతం అంతా అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకం చూస్తున్నారు.
-నవీన్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, నాలెడ్జ్ సిటీ