MLA’s Arrest | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఠాణా ఎదుట భైఠాయించిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, క్రాంతి కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆయనను పోలీసులు విడుదల చేయలేదు. హరీశ్‌రావు అరెస్టు విషయం తెలుసుకున్న నేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు గచ్చిబౌలి స్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే హరీశ్‌రావును విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌కు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావును ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనతో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ కవిత సైతం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నేతలను పరామర్శించారు.
ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మరో వైపు రాత్రి అవుతున్నా విడుదల చేయకపోవడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు గచ్చిబౌలి పీఎస్‌కు చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ ఎదుటనే ఆందోళన చేపట్టారు. పోలీసుల మాజీ మంత్రిని విడుదల చేయకుండా.. ఆందోళన చేస్తున్న నేతలను అరెస్టు చేశారు. వారిని ఎక్కడికి తరలిస్తున్నారన్న సమాచారం తెలియరాలేదు. మరో వైపు కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఇప్పటి వరకు కౌశిక్‌రెడ్డిని కోర్టుకు తరలించలేదు. అరెస్టుపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి పీఎస్ ఎదుట బైఠాయించారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అక్రమమని అన్నారు. అరెస్టుపై సమాచారం ఇవ్వడం లేదని.. కోర్టుకు పంపకుండా విచారణ పేరిట సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. మరో వైపు కౌశిక్‌రెడ్డి న్యాయవాదులు ఆయనను కలిసేందుకు వెళ్లగా.. పోలీసులు అనుమతించలేదు.